మదనపల్లె ఘటన : విస్తుగొలుపుతున్న అలేఖ్య పోస్టులు

మదనపల్లె ఘటన : విస్తుగొలుపుతున్న అలేఖ్య పోస్టులు

Updated On : January 30, 2021 / 2:24 PM IST

Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకేత్తించింది. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునర్జన్మలపై విశ్వాసమే ఈ దారుణ హత్యలకు దారి తీసిందని భావిస్తున్నారు పోలీసులు. అలేఖ్య..ఈ దారుణాలకు కారణమైనట్టు గుర్తించారు. మితిమీరిన విశ్వాసం, మూఢనమ్మకం కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసేసింది. కని పెంచిన చేతులతో కన్నబిడ్డలను బలితీసుకొనే వరకు పురిగొల్పింది. ఈ ఘటనలో పెద్ద కుమార్తె అలేఖ్య ‘మూఢత్వం’, ‘పునర్జన్మ’లపై అతి విశ్వాసం, అక్కాచెల్లెళ్ల హత్యకు కారణమైంది. హత్యలకు ముందు అలేఖ్య సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆమె ఎలా ఆలోచించిందో…మానసిక స్థితికి అద్దం పడుతున్నాయని పలువురు వెల్లడిస్తున్నారు.

కరోనా కాలంలో చిత్తూరుకు : 
ఈ నెల 22న తన పేరును మోహినిగా మార్చుకున్నట్లు వెల్లడించింది. తనని తాను ప్రపంచ సన్యాసిగా చెప్పుకొనేది. ఆ తర్వాత..శివుడు వస్తున్నాడు…పని పూర్తయ్యింది..అంటూ మరికొన్ని పోస్టులు చేసింది. శివుడుని అలేఖ్య ఆరాధించేదంట. పుట్టుక, చావు..తన చేతుల్లోనే ఉన్నాయని బలంగా నమ్మేది. కరోనా కారణంగా..లాక్ డౌన్ విధించడంతో చిత్తూరు జిల్లాలకు అలేఖ్య వచ్చింది. నెలల తరబడి ఇంటికే పరిమితమైంది. పుస్తకాలపై ఈమెకు అమితాసక్తి ఉండేది. లాక్ డౌన్ కాలంలో పూర్తిగా పుస్తకాలు చదవడానికే మొగ్గు చూపేది. అందులో మహాభారతం, చారిత్రక పుస్తకాలతో పాటు రాజకీయ, స్త్రీ సమానత్వం వంటి పుస్తకాలను చదివింది.



ఆధ్మాత్మిక వేత్త గురువు : 
ఓ ఆధ్మాత్మిక వేత్తను గురువుగా భావించేది. ఆయనను తన ప్రేమికుడిగా పేర్కొన్నా ఆమె..కొటేషన్లను పోస్టు చేసేది. ఆయన రాసిన పుస్తకాలను అలేఖ్య చదివినట్లు సమాచారం. వివాహ వ్యవస్థపై నమ్మకం కోల్పోయినట్లు పోస్టులను బట్టి చూస్తే అర్థమౌతోందంటున్నారు. జట్టును కొప్పుగా చుట్టుకుని హెయిర్ పిరమిడ్ అని, అది ఆమె అయస్కాంత శక్తిగా అభివర్ణించేది.
15న కవిత పోస్ట్ : 
ఈ నెల 15వ తేదీన ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిరాశలో కూరుకపోయినట్లు తెలుస్తోంది. ‘నా గుండె నిశ్శబ్దంగా ఏడుస్తోంది..ప్రతొక్కరినీ ఆకట్టుకోవడం కోసం నేను ఎవరినో కావాలని ప్రయత్నిస్తున్నా..కానీ అవి ఫలించడం లేదు..నా ఆశలు కాలిపోయాయి. నిరాశ అనే అగాథంలో కూరుకపోయాను..ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గందరగోళంలో పడిపోయా..ఇలాంటి సమయంలో కొత్త ఆలోచనలు వచ్చాయి. వాటిని నేను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా’ అంటూ వెల్లడించింది.



చెల్లిలో దుష్టశక్తులు :-
చెల్లిలో ఉన్న దుష్ట శక్తులను తాను పొగొడతానని తల్లిదండ్రులను చెప్పడమే గాకుండా..ఇంట్లో పెంపుడు కుక్కపై పునర్జన్మ ప్రయోగాలు చేశానని అలేఖ్య తల్లిదండ్రులను నమ్మించింది. తాను కుక్కను చంపి మళ్లీ బతికించానంది. ఈ మాటలు నమ్మిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు..ఈ జంట హత్యలకు కారణమయ్యారు. ఇక నిందితులిద్దరినీ 15 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు అప్పగించాలని న్యాయమూర్తిని కోరారు పోలీసులు. దంపతులిద్దరినీ తిరుపతిలోని మానసిక వైద్యశాలకు తరలిస్తే పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉందని మదనపల్లె జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యురాలు రాధిక నివేదిక ఇచ్చారు. ఈ మేరకు వారిద్దరినీ వైద్యశాలకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి రాగానే.. వారిని ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం ఉంటుంది.