Mahanadu: జగన్ ఇలాఖాలో టీడీపీ మాస్టర్ ప్లాన్‌.. చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీ సిద్ధం చేశారు?

వైసీపీకి చెక్ పెట్టడం.. కేడర్లో జోష్ నింపడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులివెందుల మహానాడుపై పార్టీ ఆలోచిస్తోంది.

Mahanadu: జగన్ ఇలాఖాలో టీడీపీ మాస్టర్ ప్లాన్‌.. చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీ సిద్ధం చేశారు?

Updated On : March 27, 2025 / 7:52 PM IST

వై నాట్ పులివెందుల.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదేపదే చెప్పిన మాట ఇది. ఎన్నికలు అయినా.. అధికారంలోకి వచ్చినా.. ఆ మాట విషయంలో ఇంకా సీరియస్గానే ఉన్నారేమో అనిపిస్తోంది ఇప్పుడు సీన్ చూస్తుంటే. పసుపు పండగ మహానాడు.. ఈసారి పులివెందులలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం.. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. నిజంగా మహానాడు కోసం పులివెందును ఫిక్స్ చేశారా.. అసలు చంద్రబాబు ప్లాన్ ఏంటి.. టార్గెట్ ఏంటి..

ఎక్కడో ఉండి రాజకీయం చేయడం కాదు.. ప్రత్యర్థి ఇంటికెళ్లి.. నట్టింటికెళ్లి.. ఇలాఖాకు వెళ్లి రాజకీయం చేస్తే ! ఆ ఊహే అద్భుతం కదా.. టీడీపీ ఇలాంటి పనిచేసేందుకే రెడీ అవుతుందనే ప్రచారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైనాట్ పులివెందుల అని అసెంబ్లీ ఎన్నికల టైమ్లో పదేపదే ప్రస్తావిస్తూ.. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి.. అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఇంకా ఆ విషయానికే స్టిక్ అయిందేమో అనిపిస్తోంది.

జగన్ ఇలాఖాలో బలప్రదర్శన చేసేందుకు డిసైడ్ అయిందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈసారి మహానాడును పులివెందులలో నిర్వహించాలని.. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ జరుగుతోందట. అదే జరిగితే.. అనుకున్నదే నిజం అయితే.. ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపు, సంచలనం చూడడం ఖాయం.

కడప జిల్లా రాజకీయాలు అనగానే.. ముందుగా గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే ! కడప జిల్లాను కంచుకోటగా మార్చుకుందా ఫ్యామిలీ. నభూతో నభవిష్యత్ అనే రేంజ్‌లో జిల్లా పాలిటిక్స్‌పై పట్టు సాధించింది. ఇక పులివెందుల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పులివెందులలో మహానాడు పెట్టి పసుపు పార్టీ పండుగ చేస్తే.. ప్రత్యర్థి పార్టీని మరింత టెన్షన్ పెట్టొచ్చనే గుసగుసలు.. టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయ్.

పులివెందుల సహా… కడప జిల్లా వైసీపీ అడ్డా కాదు అని చాటి చెప్పే అవకాశం ఉంటుందని.. సొంత కేడర్లో జోష్ నింపినట్లు అవుతుందని ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. పులివెందులలో మహానాడు కోసం సరైన స్థలాన్ని వెతికి పెట్టాలని.. కేడర్కు ఇప్పటికే సమాచారం వెళ్లిందనే చర్చ కూడా సాగుతోంది.

ఏకంగా పులివెందులలోనే మీటింగ్ పెడితే పోలా అని..
ఇప్పటివరకు కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. దీంతో ఈసారి అక్కడే చేపట్టాలని ముందుగా అనుకున్నారు. కడప సిటీలో నాలుగు అనువైన స్థలాలను కూడా మహానాడు కోసం ఎంపిక చేశారు. వాటిని అధినాయకత్వానికి పంపించారు. ఐతే ఇప్పుడు ఆలోచన మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

అక్కడ, ఇక్కడ ఎందుకు.. ఏకంగా పులివెందులలోనే మీటింగ్ పెడితే పోలా అని.. టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయట. మహానాడుతో జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీని గట్టిగా నిలువరించాలని టీడీపీ ప్లాన్‌గా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. గెలుపు జోష్లో ఉన్న టీడీపీ… పులివెందులలో మహానాడు ని నిర్వహించి సవాల్ చేస్తే.. దానికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఇప్పటివరకు కడపలో మహానాడు నిర్వహించకపోవడానికి ఏకైక కారణం.. ఆ జిల్లాలో టీడీపీకి ఎప్పుడూ చెప్పుకోదగ్గ సీట్లు రాకపోవడమే ! ఉమ్మడి జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే.. 2004లో రెండు సీట్లు.. 2009, 2014లో ఒకే ఒక్క స్థానానికే సైకిల్ పార్టీ పరిమితం అయింది. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా.. 2024లో సీన్ మారింది.

పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు సీట్లను కూటమి కైవసం చేసుకుంది. వైఎస్ కుటుంబానికి పట్టు ఉన్న కడప జిల్లాలో ఆ రేంజ్ సీట్లు సాధించడంతో.. కేడర్ జోష్ పెరిగిందట. దాన్ని డబుల్ చేసేలా ఇప్పుడు పులివెందులలో మహానాడు నిర్వహిస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధిష్టానం ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. పులివెందులలో మహానాడు పెడితే.. రాయలసీమవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడమే కాదు.. బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుందని సైకిల్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది.

వైసీపీకి చెక్ పెట్టడం.. కేడర్లో జోష్ నింపడం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులివెందుల మహానాడుపై పార్టీ ఆలోచిస్తోంది. కడపలో ఇప్పటికే స్థలం పరిశీలించారు. మరి అక్కడే ఫిక్స్ అవుతారా.. లేదంటే పులివెందులకు షిఫ్ట్ చేస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మే నెలలో మహానాడు నిర్వహించబోతుండగా.. పులివెందులలో జరిగితే.. పొలిటికల్ సెన్సేషన్‌గా మారడం ఖాయం. మహానాడు అంటే మూడు రోజుల పండగ.. అలాంటి కార్యక్రమం పులివెందులలో జరిగితే.. ఎండలకు మించి రాజకీయాలు మండిపోతాయ్.