స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మకరజ్యోతిని దర్శించిన భక్త జనం

స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో మకరజ్యోతిని దర్శించిన భక్త జనం

Updated On : January 14, 2021 / 8:02 PM IST

Sabarimala: మకర జ్యోతి దర్శనంతో శబరిమల దేవస్థానం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అశేష భక్తగా ఆశగా ఎదురుచూసిన జ్యోతి దర్శనం గురువారం సాయంత్రం 6.49 గంటలకు జరిగింది. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఐదువేల మంది భక్తులను మాత్రమే మకరజ్యోతి దర్శనానికి అనుమతించారు. భక్తుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అధికారులు కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉన్న భక్తులకే అనుమతి కల్పించారు.

అలా జరగడంతో ఈసారికి అతి తక్కువమంది భక్తులకు మాత్రమే లోనికి అనుమతి లభించింది. పొన్నాం బలమేడు కొండల్లో నుంచి కనిపించిన మకర జ్యోతిని భక్తులు దర్శించుకున్నారు. పంబ, పులిమేడ్, పంచలిమేడ్‌, నీల్ కల్ తదితర ప్రాంతాల్లో అయ్యప్ప భక్తులు మకర జ్యోతిని దర్శనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్చువల్ వేదికగా కొందరు భక్తులు మకర జ్యోతి దర్శనానికి అనుమతి పొందారు.

జ్యోతి దర్శనంతో వేలాది భక్తులు హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి.

జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించి మూలమూర్తికి హారతి ఇచ్చారు. వెంటనే క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం సందర్భంగా జరిగే ప్రదర్శనలో పండలం రాజ కుటుంబీకులు, వారి ప్రతినిధులు పాల్గొనలేదు.