కామాంధుడిని కొడవలితో ఎదుర్కోన్న మైనర్ బాలిక…. చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన

Crime News : చిత్తూరు జిల్లా, రామసముద్రం మండలంలో మైనర్ బాలిక ధైర్య సాహాసాలు ప్రదర్శించింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన కామాంధుడిపై కొడవలితో దాడి చేసి తప్పించుకుంది.
మండలంలోని తిరుమలరెడ్డి పల్లెకి చెందిన రెడ్డెప్ప కు నలుగురు పిల్లలు. నాలుగవ సంతానమైన మైనర్ బాలిక (15) తన అక్క పావనితో కలిసి రోజూ గొర్రెలు మేపడానికి సమీపంలోని చెరువు, కొండ ప్రాంతానికి వెళ్లేది. ఈ నేపథ్యంలోఅక్టోబర్ 3, శనివారం యధావిధిగా గొర్రెలను మేపడానికి రెడ్డివారి కుదవ ప్రాంతానికి అక్క చెల్లెళ్ళు వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన ఆర్.శంకరప్ప (40) మైనర్ బాలికను పక్కనున్న పొదలలోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక అరుపులు వేస్తూ తప్పించుకొని వెళ్లడానికి ప్రయత్నం చేసింది.
నిందితుడు ఆర్. శంకరప్ప
కానీ … ఆ కామాందుడు వదలకుండా పట్టుకోవడంతో బాలిక తన చేతిలోని కొడవలితో చేతిపై కొట్టగా అతడు అక్కడి నుండి పారిపోయాడు. అతను గత కొంతకాలంగా బాలికను వశపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది.
ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శంకరప్పను అనేకసార్లు హెచ్చరించినా అతను లెక్కచేయలేదు. బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు. శంకరప్పను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.