Michaung Cyclone Alert : మిచాంగ్ ముప్పు! కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాన్.. సీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ - వాయువ్య దిశగా పయనించి శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారం తుఫానుగా బలపడుతుందని ..

Michaung Cyclone Alert : మిచాంగ్ ముప్పు! కోస్తాంధ్ర వైపు దూసుకొస్తున్న తుపాన్.. సీమ, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

Michaung Cyclone

AP Cyclone Alert : ఏపీకి మిచాంగ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది. కోస్తాంధ్రవైపుకు తుపాన్ దూసుకొస్తుంది. దీంతో కోస్తాంధ్ర జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమలోనూ తుపాను ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మిచాంగ్ తుఫాన్ కారణంగా రాబోయే నాలుగైదు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈనెల 5వ తేదీన నెల్లూరు – మచిలిపట్నం వద్ద మిచాంగ్ తుపాన్ తీరందాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ తుపానుకు మయన్మార్ సూచించిన ‘మిచాంగ్’ గా నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావం శనివారం నుంచి మొదలై ఈనెల ఐదో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది.

 

అగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా పయనించి శనివారానికి నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా.. ఆదివారం తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పుదుచ్చేరికి 730 కిలో మీటర్లు, చెన్నైకి 740 కిలో మీటర్లు, నెల్లూరుకు 860 కిలో మీటర్లు, బాపట్లకు 930 కిలో మీటర్లు, మచిలీపట్నంకు 910 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావం కారణంగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

సోమవారం పశ్చిమ గోదావరి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీ పొట్టిశ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను నేపథ్యంలో తాడేపల్లిలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో స్టేట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు.