తాడిపత్రిలో అర్ధరాత్రి హైటెన్షన్.. జేసీ నివాసానికి భారీగా అనుచరులు.. పోలీసులు అలర్ట్.. పట్టణంలో బందోబస్తు ..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

High tension in Tadipatri
Tadipatri High Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ నివాసానికి పెద్దెత్తున ఆయన అనుచురులు చేరుకున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తారన్న సమాచారంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తామంటూ జేసీ ప్రభాకరెడ్డి, ఆయన అనుచరులు అంటున్నారు. తాడిపత్రికి వచ్చేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాకూడా పోలీసులు నన్ను తాడిపత్రిలోనికి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి శుక్రవారం రాత్రి వస్తున్నారని జోరుగా ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరికి పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు.
ఎన్నికల అనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాడిపత్రికి వస్తుండటంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.