Nimmala Rama Naidu: రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు- మంత్రి నిమ్మల రామానాయుడు

ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. Nimmala Rama Naidu

Nimmala Rama Naidu: రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు- మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Rama Naidu Representative Image (Image Credit To Original Source)

Updated On : January 5, 2026 / 1:23 AM IST
  • అబద్దాలకు, అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్
  • ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు 8వేల కోట్లు ఖర్చు చేశాం
  • నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే నీళ్లు కావాలంటాం

 

Nimmala Rama Naidu: వైసీపీ అధినేత జగన్ పై నిప్పులు చెరిగారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అబద్దాలకు, అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్ మోహన్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 మే 5వ తేదీ ఆమోదముద్ర వేసింది మీరే. అదే నెల 20వ తేదీ NGT స్టే ఆర్డర్ తెచ్చింది మీరే అని చెప్పారు.

రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టులకు తన హయాంలో జగన్ కేటాయించింది కేవలం 2000 కోట్లు మాత్రమే అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు 8వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు.

”ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించాం. రాయలసీమ మీద ప్రేమ ఉంటే ఐదేళ్ల పాలనలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు కాని, ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదు? పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ వరకు, మడకశిర బ్రాంచ్ 493 కిలోమీటర్ వరకు అమరాపురం చెరువు వరకు కృష్ణమ్మ నీటిని తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదే. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువులు జలకళను సంతరించుకున్నాయి.

సంవత్సరానికి 3వేల టీఎంసీలు గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిలో 200 టీఎంసీలు వాడుకుంటే వాళ్లకు అభ్యంతరం ఎందుకు? నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే మేము నీళ్లు కావాలంటాం. అందుకే కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణకి ఉపయోగించినప్పుడు దిగువన పోలవరం నుండి ఆంధ్రాకు ఉపయోగిస్తే తప్పేంటి? తెలంగాణ నేతల వివాదాల మన రాష్ట్రంలో చొప్పించి వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకం” అని ధ్వజమెత్తారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Also Read: ఆ రోజు ఈ విధంగా మేం చేసిన కృషి వల్లే..: భోగాపురం ఎయిర్‌పోర్టుపై జగన్ స్పందన