Nadendla Manohar: వీటిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది: నాదెండ్ల మనోహర్ వార్నింగ్‌

మహిళలపై జరిగే అరాచకాలను కూడా సహించేది లేదని చెప్పారు.

Nadendla Manohar: వీటిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది: నాదెండ్ల మనోహర్ వార్నింగ్‌

Nadendla Manohar

Updated On : October 22, 2024 / 5:14 PM IST

ఉచిత ఇసుక విధానంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇవాళ ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి అవినీతినీ సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే మహిళలపై జరిగే అరాచకాలను కూడా సహించేది లేదని చెప్పారు.

గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక బాధ్యత తీసుకుని ముందుకు వెళ్లేలా సమన్వయంతో పనిచేస్తామని, రైతాంగానికి, గ్రామీణ ప్రాంతాల వారికి మేలు చేకూరేలా పల్లె పండుగ కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

వ్యవస్థపై నమ్మకం కలిగేలా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఆదేశం ఇచ్చామని, ప్రాధాన్యం ప్రకారం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీపావళి తర్వాత అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన చేస్తామని, అంకిత భావంతో పనిచేసి కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెంచుతామని అన్నారు.

పార్టీల పరంగా నాయకులను సమన్వయం చేసుకుని పనిచేస్తామని, ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు దగ్గరలోని ఏ రైస్ మిల్లుకు అయినా ధాన్యం తీసుకెళ్లొచ్చని నాదెండ్ల మనోహర్ చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, కాకినాడ పోర్టులో 27వేల మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని అన్నారు.

ఏపీ వ్యాప్తంగా సీఐడీ తనిఖీల కలకలం.. మద్యం తయారీ కేంద్రాల్లో ముమ్మరంగా సోదాలు..