Ananth Ambani : ఏపీకి అనంత్ అంబానీ.. మంత్రి లోకేశ్ తో కలిసి సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన..
ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

Ananth Ambani : రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కీలక ముందడుగు పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 500 సీబీజీ ప్లాంట్లలో మొదటి దానికి శంకుస్థాపన జరగనుంది. ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకర్ పల్లిలో స్థాపించనున్న తొలి సీబీజీ ప్లాంట్ కు మంత్రి నారా లోకేశ్ తో కలిసి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు.
దివాకర్ పల్లిలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రదేశం, సభా స్థలంలో ఏర్పాట్లు, వీఐపీ జనరల్ పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని సూచించారు.
ఆంధ్రపద్రేశ్ రాష్ట్రంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ మేరకు గతంలోనే రిలయన్స్ తో చర్చలు జరిపింది. దీంతో రాష్ట్రంలో 65వేల కోట్ల పెట్టుబడులతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది.
Also Read : ఏపీలో త్వరలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు ఇవే.. సరికొత్త డిజైన్, ప్రత్యేకతలు ఏంటంటే..
ప్రకాశం, కడప, సత్యసాయి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, తిరుపతి, అల్లూరి జిల్లాల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 139 కోట్లతో తొలి ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ సంస్థ రైతుల నుంచి బీడు భూములను లీజుకు తీసుకుని అందులో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 35వేలు చెల్లించనుంది. అలాగే రైతులు ప్లాంట్ కోసం గడ్డి పండించి సరఫరా చేస్తే కూడా వారికీ ఆర్థిక లాభం చేకూరుతుంది. ఈ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో స్థానికంగా యువతకు కూడా ఉపాధి లభించనుంది.