Minister Parthasarathy : జోగి రమేశ్ వ్యవహారం.. సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన మంత్రి
జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు.

Minister Parthasarathy : వైసీపీ నేత జోగి రమేశ్ వ్యవహారం టీడీపీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై మంత్రి పార్థసారథి స్పందించారు. సీఎం చంద్రబాబుకు ఆయన క్షమాపణలు చెప్పారు. సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేశ్ పాల్గొంటారని తనకు తెలియదన్నారు. ముందే తెలిసి ఉంటే అసలు ఆ కార్యక్రమానికి హాజరయ్యే వాడిని కాదన్నారు.
”నన్ను అభిమానించే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నా. మా అధినేత చంద్రబాబుకి క్షమాపణ చెబుతున్నా. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు నేను ఏ రోజూ చేయను. ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాను. చంద్రబాబు, లోకేష్ నాయకత్వం బలపడేందుకు పనిచేస్తాను. జగన్ నాయకత్వంపై నమ్మకం కోల్పోయి అనేకమంది నేతలు జనసేన, టీడీపీలో చేరుతున్నారు. జోగి రమేశ్ కూడా ఆ విధమైన ప్రయత్నం చేశారేమో నాకు తెలియదు. ఇది పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు. గౌడ సంఘీయులంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనుకోకుండా జరిగిన ఘటన ఇది. జోగి రమేశ్ అక్కడికి వస్తాడని ఊహించలేదు. నేను కూడా చాలా ఆలస్యంగా అక్కడికి వెళ్లాను. ఒకవేళ ముందే నేను అక్కడి ఉన్నట్లైతే, అతడు వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేసే వాడిని. నేను గంట, గంటన్నర ఆలస్యంగా అక్కడికి వెళ్లాను. అప్పటికే జోగి రమేశ్ అక్కడ ఉన్నాడు. ఇది పార్టీ పరంగా జరిగిన కార్యక్రమం కాదు. పార్టీకి, రాజకీయాలకు సంబంధం లేదు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నేను చింతిస్తూ వారికి సారీ తెలియజేస్తున్నా. చంద్రబాబుకు కూడా క్షమాపణలు చెబుతున్నా’ అని వివరణ ఇచ్చారు మంత్రి పార్థసారథి.
నిన్న నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేశ్ కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి టీడీపీ నేతలు చెట్టపట్టాలేసుకుని తిరగడం వివాదానికి దారితీసింది. ఆ కార్యక్రమంలో మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. జోగి రమేశ్ తో వారు కలిసి ఉండటం టీడీపీలో పెను దుమారం రేపింది. చంద్రబాబును దూషించిన వ్యక్తితో చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఏంటని టీడీపీ క్యాడర్ మండిపడుతోంది. దీనిపై మంత్రి లోకేశ్ సైతం సీరియస్ అయ్యారు. క్యాడర్ కు ఎలాంటి సందేశం పంపుతున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహించారు. దీనిపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషను లోకేశ్ అడిగారు.
Also Read : దీన్ని రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌లా చేస్తాం: చంద్రబాబు