Prathipati Pullarao : దమ్ముంటే.. ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి- విడదల రజినికి ఎమ్మెల్యే సవాల్
మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని.. ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. నీ అరాచకాలు మొత్తం బయటకు తీసి.. తిన్నదంతా కక్కిస్తాం.

Prathipati Pullarao : మాజీ మంత్రి విడదల రజనీ, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
మా జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుంది, గుర్తు పెట్టుకోండి, ఎవరినీ వదిలిపెట్టను, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా అంటూ విడదల రజినీ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
నీ అరాచకాలు మొత్తం బయటకు తీస్తా, తిన్నదంతా కక్కిస్తా..
రజినీ అరాచకాలు మొత్తం బయటకు తీసి.. తిన్నదంతా కక్కిస్తాం అని ఎమ్మెల్యే హెచ్చరించారు. విడదల రజిని చిలకలూరిపేటలో అరాచకాలు చేసి.. గుంటూరు పారిపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో మరోసారి చిలకలూరిపేటకి వచ్చారని మండిపడ్డారు.
ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు?
”చిలకలూరిపేటలో తన అనుచరులతో లెక్కలేనన్ని అవినీతి పనులు చేసి.. గుంటూరుకి పోయావు. ఈ విషయాలన్నీ మర్చిపోతే ఎలా? నీకు ఓటేసిన ప్రజలను.. చిలకలూరిపేట వాసులను పూర్తిగా నాశనం చేశావు. మేము ఏ తప్పు చేయలేదు. దేనికైనా రెడీ. రజిని.. ఏడు నెలలు ఎక్కడ దాక్కున్నావు. నీ అరాచకాలు మొత్తం బయటకు తీసి.. తిన్నదంతా కక్కిస్తాం.
జగన్ అండ చూసుకుని రెచ్చిపోయావు..
దమ్ముంటే.. ఈ ఐదేళ్లు పురుషోత్తమపట్నంలోనే ఉండాలి. జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి అండ చూసుకుని విపరీతమైన అరాచకాలు చేశావు. రాబోయే రోజుల్లో నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు” అని విడదల రజినీకి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
మీ సంగతి చూస్తా, వడ్డీతో సహా తిరిగిస్తా..
అంతకుముందు ఎమ్మెల్యే పుల్లారావు టార్గెట్ గా నిప్పులు చెరిగారు మాజీ మంత్రి విడదల రజిని. మాపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తారా? నన్ను కానీ, నా కుటుంబసభ్యులను కానీ, నా నియోజకవర్గ ప్రజలను కానీ, ముఖ్యంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించి, భయపెట్టి, అక్రమ కేసులు పెడితే.. ఎవ్వరం భయపడం.
మీరు కేసులు పెట్టిన ప్రతిసారీ ఇంకా బలంగా ఎదుర్కొంటాం. ఇంకా బలంగా నిలబడతాం. ముందుకు వెళ్తాం. దోపిడీలు, ఇల్లీగల్ పనులు చేసి, జేబులు నింపుకుని రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారేమో.. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా.. నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు.. రాజకీయాలు ఇక్కడే చేస్తాను. మాకూ ఒక రోజు వస్తుంది. మీ సంగతి తేలుస్తా” అంటూ ఎమ్మెల్యే పుల్లారావుకి వార్నింగ్ ఇచ్చారు విడదల రజినీ.