AP Cabinet Expansion : చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ..రాజకీయ విశేషాలు

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పిల్లి సుభాశ్ చంద్రబోస్ పోటీ చేయాల్సిన నియోజకవర్గం రామచంద్రాపురంలో పోటీచేశారు. ఇప్పుడు ఆయన స్థానంలోనే జగన్ మంత్రివర్గంలో చేరుతున్నారు. సామాజికవర్గాల సమీకరణలో భాగంగా వేణుగోపాలకృష్ణకు లక్కు కలిసొచ్చింది.
తాటిపాకలో జననం : –
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణ 2001లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజోలు జెడ్పీటీసీగా పోటీచేసి గెలిచారు. 2006 నుంచి 2011 వరకు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డ్ సభ్యుడిగా వర్క్ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున కాకినాడ రూరల్ నియోజవర్గంలో పోటీచేసి 9 వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
రామచంద్రాపురం నియోజకవర్గం : –
2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును కురసాల కన్నబాబుకు కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీంతో వేణుగోపాలకృష్ణ.. రామచంద్రాపురం నియోజకవర్గం సీటు కావాలని కోరారు. వేణుకు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కేటాయించిన జగన్.. అదే నియోజకవర్గానికి చెందిన పిల్లి సుభాశ్ చంద్రబోస్‌కు మండపేట అసెంబ్లీ సీటును కేటాయించారు. రామచంద్రాపురంలో పోటీచేసిన వేణుగోపాలకృష్ణ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై 5 వేల 168 ఓట్ల తేడాతో గెలుపొందారు.
జగన్ మంత్రివర్గంలో : –
మండలి రద్దు నిర్ణయంతో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి చేపట్టిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పదవికి రాజీనామా చేసిన రాజ్యసభకు వెళ్లారు. సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది.