Botcha Satyanarayana : ప్రభుత్వం తొందరపడింది..! అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు..
ప్రభుత్వాలు దూర దృష్టితో ఆలోచించాలి.

Botcha Satyanarayana : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంపై వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ ప్రభుత్వం తొందరపడిందని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సున్నితమైన విషయాలపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
‘అల్లు అర్జున్ అరెస్ట్ చూశాను. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సంయమనం పాటించాలి. ప్రభుత్వాలు దూర దృష్టితో ఆలోచించాలి. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన జరగడం, ఓ మహిళ చనిపోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంది. ప్రభుత్వాలకు.. నాయకులను ఇబ్బంది పెట్టాలనేది ఫ్యాషన్ అయిపోయింది. వాస్తవ పరిస్థితులను ఆలోచన చేసి ముందుకు వెళ్లాలి’ అని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నీటి సంఘం ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. అటు మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా వ్యవహారంపైనా బొత్స స్పందించారు. అవంతి శ్రీనివాస్ వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేశారని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Also Read : అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అటు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించిన సంగతి తెలిసిందే. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా.. అతడిపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదని జగన్ అభిప్రాయపడ్డారు.