Nara Bhuvaneswari : తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి భారీగా విరాళం

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలవారు పెద్దుత్తున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో..

Nara Bhuvaneswari : తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి భారీగా విరాళం

Nara Bhuvaneswari

Nara Bhuvaneswari : భారీ వర్షాలకుతోడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మున్నేరు ఉధృతి కారణంగా పరిసర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ముఖ్యంగా ఖమ్మం నగరంలో అత్యధిక నష్టం వాటిల్లింది. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో మున్నేరులోకి వరద రావడంతో నగరంలోని త్రీటౌన్ ఏరియా ముంపుకు గురైంది. ఇంట్లోని సామాన్లు వరదనీటిలో కొట్టుకొని పోవటంతో కట్టుబట్టలతో ముంపు బాధితులు మిగిలిపోయారు. మరోవైపు ఏపీలోని విజయవాడ, గుంటూరులోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ముఖ్యంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో నడములోతు వరద నీరు చేరింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి ఆహారం, తాగునీరు అందిస్తున్నారు.

Also Read : Tollywood Donations : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. సినీ ప్రముఖుల భారీ విరాళాలు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో సినీ ప్రముకులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాలవారు పెద్దుత్తున సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని అందజేశారు. రాష్ట్రానికి రూ. కోటి చొప్పున రెండు రాష్ట్రాలకు రూ. 2కోట్లను హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తరపున అందజేశారు. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడాలి. సంక్షోభంలో బాధితులకు అండగా ఉండడమే మనం వారికి చేసే అతిపెద్ద సాయం అన్నారు.

 

తెలంగాణ, ఆంధ్రాల్లో వచ్చిన వరదలు చాలా మంది జీవితాల మీద ప్రభావం చూపించాయి. వరద నీటిలో చిక్కుకుపోయి ఎంతో మంది ఇక్కట్లు పడుతున్నారు. బాధిత ప్రాంతాలు, ప్రజలకు అందించే సహకారంలో మేం చేసిన ఈ సాయం వారి జీవితాలపై ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నాం. అందుకే రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించడం జరిగిందని భువనేశ్వరి అన్నారు. వరద ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని భువనేశ్వరి పేర్కొన్నారు.