ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా : మద్య నిషేధంపై లోకేష్ సెటైరిక్ ట్వీట్

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 12:51 AM IST
ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా : మద్య నిషేధంపై లోకేష్ సెటైరిక్ ట్వీట్

Updated On : November 20, 2019 / 12:51 AM IST

ఏపీలో మద్య నిషేధంపై టీడీపీ నేత నారా లోకేశ్ సెటైరిక్ ట్వీట్ చేశారు. మద్యపాన నిషేధం కోసం జగన్‌ గారు వేస్తున్న ముందడుగు ఫలితంగా.. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. మద్యం దుకాణాల్లో రేట్లు పెంచి వైసీపీ మార్క్‌ దోపిడీని యధావిధిగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో కంటే ఒక్క క్వార్టర్‌ బాటిల్‌ అమ్మకమైనా తగ్గిందా అంటూ ప్రశ్నించారు లోకేశ్‌.

మద్యం తయారీదారుల నుంచి జగన్‌ ముడుపులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌, దేవినేని ఉమ మతి లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న బార్లలో టీడీపీ నేతలవి ఎన్ని ఉన్నాయో చెప్పాలని నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. 

వైన్ షాపులను కుదిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్.. ప్రస్తుతమున్న బార్లను 40 శాతం తగ్గించాలని నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. బార్లల్లో మద్యం సరఫరా వేళలను కూడా ప్రభుత్వం కుదించింది. అంతేకాదు.. బార్లల్లో అమ్మే మద్యం ధరలను కూడా త్వరలోనే పెంచనున్నారు. రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు మినహా.. ప్రస్తుతమున్న 798 బార్లను 40 శాతం తగ్గించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. వచ్చే జనవరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీంతో పాటు బార్లలో మద్యం సరఫరా చేసే సమయాన్ని కూడా ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకే పరిమితం చేసింది. తర్వాత.. ఆహార సరఫరాకు మరో గంట వెసులుబాటు కల్పించింది. స్టార్ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు మద్యం సరఫరా చేయనున్నారు. 

Read More : ఇంగ్లీషు కుదుపు : వైసీపీ ఎంపీపై సీఎం జగన్ సీరియస్