AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త యాప్ వచ్చేస్తోంది.. ఒక్కసారి స్కాన్ చేస్తే చాలు.. వాళ్ల బండారం బయటపడినట్లే..
నకిలీ మద్యం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం. నకిలీ మద్యంకు చెక్ పెట్టేందుకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది..

AP Govt
AP Govt APATS APP : ఏపీలో కల్తీ మద్యం వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతుంది. ములకలచెరువు నకిలీ మద్యం అంశం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు, టీడీపీ నేత జనార్ధన్ రావును పోలీసులు అరెస్టు చేశారు.
అయితే, ఈ అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్ముతున్నారంటూ, ప్రతీ నియోజకవర్గంలో కూటమి నేతల కనుసన్నల్లో నకిలీ లిక్కర్ తయారవుతోందని ఆరోపిస్తూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో కూటమి పాలకుల్లో ఈ నకిలీ మద్యం వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారింది. వైసీపీ దూకుడుకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్ వేశారు.
Also Read: నకిలీ మద్యం కేసు తర్వాత ఆ ప్రాంతంలో వేడెక్కిన రాజకీయం.. ఏం జరుగుతోంది?
నకిలీ మద్యం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాబోయే కాలంలో నకిలీ మద్యం అనేది లేకుండా చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కొత్త యాప్‌ను అందుబాటులో తేబోతున్నారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏపీఏటీఎస్ (APATS) పేరుతో ఒక ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు సిద్ధమయ్యారు.
నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు త్వరలో ఓ యాప్ తీసుకురానున్నట్లు, మద్యం సీసా పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం తయారీకి సంబంధించిన వివరాలన్నీ బయటకొస్తాయని.. ఆ విధంగా యాప్ రూపొందిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఏపీఏటీఎస్ యాప్ గురించి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. ఏపీఏటీఎస్ పేరుతో ఒక ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ యాప్‌తో మద్యం బాటిల్ పై ఉన్న లేబుల్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చునని చెప్పారు.
మద్యం ఎప్పుడు తయారైంది..? దాని నాణ్యత ప్రమాణాలు ఎంత..? గడువు తేదీ ఎప్పటి వరకు ఉంది..? వంటి కీలక సమాచారం మొత్తం క్షణాల్లో కనిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. తద్వారా మద్యం ప్రియులు నకిలీ మద్యం బారినపడకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని అన్నారు.
కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్న ఏపీఏటీఎస్ యాప్‌తో కల్తీ మద్యం వ్యాపారుల గుండెల్లో గుబులు పుట్టించడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. అయితే, ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.