ఆ పెదరాయుడు ఎవరు? ఎప్పుడొస్తాడు? ఆందోళనలో వైసీపీ కార్యకర్తలు

new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో కొంత వరకూ అసంతృప్తి బయట పడుతూ ఉండడం సహజం. ఇక అదే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలన్నీ మారిపోతాయి. పదవుల కోసం పోటీ మొదలవుతుంది. పెత్తనం కోసం ఆధిపత్య పోరు మొదలవుతుంది. ఇప్పుడు వైసీపీలో అవే కనిపిస్తున్నాయి. అధికార పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయని టాక్.
ప్రతీ జిల్లాలో పార్టీలో గొడవలు:
ఇక్కడా అక్కడా అని లేదు ప్రతీ జిల్లాలో ఏదో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాలో అయితే విభేదాలు మరీ శ్రుతి మించుతున్నాయి. మొన్నటి వరకూ గన్నవరంలో తారస్థాయికి చేరిన విభేదాలు ఇప్పుడు కాస్త సర్దుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. కానీ, ఎప్పుడు మళ్లీ బయటపడతాయో తెలియని పరిస్థితి ఉంది. ఇక చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య రేగిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. అక్కడ పరిస్థితి మామూలుగా లేదు. అధికార పార్టీకి పెద్ద తలనొప్పిలా మారిందంటున్నారు.
భరత్, రాజా మధ్య కోల్డ్ వార్:
రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రతి విషయంలోనూ ఏదో ఇష్యూ లేవనెత్తుతూ రచ్చకెక్కుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎంపీ నందిగం సురేశ్ మధ్య జరిగిన గొడవలు సమసిపోయినా.. శ్రీదేవిని మాత్రం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉందంటున్నారు. ఒక దాని వెంట ఒక సమస్య తలెత్తుతూ ఆమెను నిలకడగా ఉండనీయడం లేదు.
https://10tv.in/reorganisation-of-districts-in-andhra-pradesh-turning-out/
ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే రజిని మధ్య విభేదాలు:
చిలకలూరిపేటలోనూ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజిని మధ్య విభేదాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నేతలిద్దరూ బయట పడకపోయినా… లోలోపల ఒకరిపై ఒకరు అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. అనుచరుల దగ్గర వారి మధ్య విభేదాలు బయట పడుతున్నాయని చెబుతున్నారు.
అధిష్టానం పూర్తిగా విఫలం:
పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించడంలో అధిష్టానం పూర్తిగా విఫలం అవుతోందని కేడర్ అంటోంది. అధికార పార్టీలో ఉండే నేతల మధ్య గొడవలు షరా మాములే. అలాంటివి జరుగుతుంటే అధిష్టానం, పార్టీ కీలక నేతలు వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. సీఎం జగన్ పాలనపైనే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టడంతో పార్టీలో సమస్యలు పట్టించుకొనే వారే కనిపించడం లేదంటున్నారు.
నేతల మధ్య విభేదాలతో పార్టీకి నష్టం:
అధిష్టానం తరఫున పెద్దలుగా వ్యవహరించే నేతలు ఇలాంటి సందర్భాల్లో పెదన్న పాత్ర పోషించాలి. కానీ, ఇక్కడ పార్టీలో అలాంటి ప్రయత్నాలు జరగడం లేదని కేడర్ ఫీలవుతోంది. దీంతో చిన్న చిన్న విభేదాలు పెద్ద పెద్ద ఘర్షణలకు దారి తీస్తున్నాయంటున్నారు. నేతల మధ్య విభేదాలు వారి మధ్యే కాకుండా పార్టీ కేడర్‌కు తద్వారా పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అధిష్టానం పెద్దలు వెంటనే కలుగజేసుకొని, ఈ విభేదాలను పరిష్కరించాలని పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు.