Ys Jagan : ఏపీలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి- కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని అన్నారు.

Ys Jagan : ఏపీలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి- కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

Updated On : April 8, 2025 / 4:40 PM IST

Ys Jagan : కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ లేదని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే.. బీహార్ వంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలని కామెంట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం పరువును రోడ్డున పడేసిన పరిస్థితులు చంద్రబాబు పాలనలో కనిపిస్తున్నాయన్నారు జగన్. సత్యసాయి జిల్లా రాప్తాడులో జగన్ పర్యటించారు. పాపిరెడ్డిపల్లికి వెళ్లిన జగన్ వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని ఆరోపించారు. ఏపీలో బెదిరింపు రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను భయపెడుతున్నారని జగన్ అన్నారు.

Also Read : మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కొడుకుపై చంద్రబాబు, జగన్ ట్వీట్స్

”వైసీపీ కార్యకర్త లింగమయ్యపై టీడీపీ నేతలు దాడి చేశారు. 20 మంది దాడి చేస్తే ఇద్దరిపైనే కేసులు పెట్టారు. దాడిని ప్రోత్సహించిన వారిపై కేసులు పెట్టలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీకి బలం లేదని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకున్నారు. ఏ పదవైనా తమకే కావాలన్నట్లు కూటమి ప్రభుత్వం పని చేస్తోంది” అని విరుచుకుపడ్డారు జగన్.

రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యాడు. మార్చి 30న లింగయ్యపై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లింగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇవాళ పాపిరెడ్డిపల్లికి వెళ్లిన జగన్ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. లింగమయ్య కుటుంబసభ్యులను జగన్ ఓదార్చారు. తాను అండగా ఉంటానని వారికి హామీ ఇచ్చారు. వైసీపీ శ్రేణులకు ధైర్యం చెప్పారు జగన్.

Also Read : మరో 15 ఏళ్లు ఏపీలో కూటమి సర్కారే ఉంటుంది- పవన్ కల్యాణ్

”కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను వేధిస్తోంది. కేసులు పెట్టి, జైళ్ల చుట్టూ తిప్పుతోంది. నెల రోజులకు పైగానే జైల్లో పెట్టించారు. దళిత, మాదిగ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా 145 రోజులు జైల్లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లు, జైల్లో పెట్టింది వైసీపీ వాళ్లను.

టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో వంశీ లేడని చెప్పినా.. వంశీని అదే కేసులో ఇరికించారు. 50 రోజుల నుంచి వంశీని జైల్లో పెట్టారు. ఇలా రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పరిపాలన సాగిస్తున్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని రాజకీయం చేయడం నేర్చుకోండి. సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేకపోయారు? సూపర్ 7 హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? ప్రజల గొంతు వినిపించకుండా చేసేందుకు రెడ్ బుక్ పాలన సాగిస్తూ వైసీపీ కార్యకర్తలను, నేతలను, ప్రశ్నించే ప్రజలను పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు” అని జగన్ ధ్వజమెత్తారు.