భోజనం వద్దన్న బాబు..మంచినీళ్లు కూడా తీసుకోలేదు!

భోజనం వద్దన్న బాబు..మంచినీళ్లు కూడా తీసుకోలేదు!

Updated On : March 1, 2021 / 4:13 PM IST

Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని..నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శి, వైద్యుడు మాత్రమే బాబుతో ఉన్నారు. ఛైర్ ఏర్పాటు చేసినా..బాబు అందులో కూర్చొకుండా..నేలపైనే బైఠాయించారు.

మధ్యాహ్నం కావడంతో..భోజనం చేయాలని ఎస్పీ, ఆర్డీవోలు బాబుకు సూచించారు. దీనికి బాబు నో చెప్పారు. కనీసం మంచినీళ్లు కూడా తీసుకోలేదని సమాచారం. హైదరాబాద్ కు వెళ్లే ఫ్లైట్ కు టికెట్ ను బుక్ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే..తాను వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని బాబు తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ విమానాశ్రయానికి చేరుకున్నారు. బాబుతో మాట్లాడారు.

తిరుపతిలో ఉన్న గాంధీ విగ్రహం వరకైనా అనుమతనివ్వాలని, అక్కడే నిరసన వ్యక్తం చేస్తానని బాబు చెబుతున్నారు. బయటకు వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7.00 గంటలకు హైదరాబాదు కు బాబు వెళ్లాల్సి ఉంది. ఇందుకు టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆయన్ను ముందుగానే..హైదరాబాద్ కు పంపిస్తారా ? లేక సాయంత్రం 7 గంటల వరకు విమానాశ్రయంలోనే ఉంటారా ? అనేది చూడాలి. మరోవైపు..విమానాశ్రయం బయట భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం మూలంగా బాబుకు అనుమతినివ్వడం లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.