Palakollu Constituency: పాలకొల్లులో రామానాయుడు జోరుకు బ్రేక్ వేసే దమ్మున్న లీడర్ ఎవరు?

పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు.

Palakollu Constituency: పాలకొల్లులో రామానాయుడు జోరుకు బ్రేక్ వేసే దమ్మున్న లీడర్ ఎవరు?

Palakollu Assembly Constituency

Palakollu Assembly Constituency: ఏపీలో వీఐపీ నియోజకవర్గం పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఇక్కడి వారే.. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులకు పాలకొల్లు కేరాఫ్ అడ్రస్.. జనసేనాని పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కు గట్టి పట్టున్న ప్రాంతంగా చెప్పే పాలకొల్లు నియోజకవర్గంలో గత రెండుసార్లు గెలిచింది టీడీపీ.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి కంచుకోటైన పాలకొల్లులో ఇంతవరకు వైసీపీ బోణీకొట్టలేకపోయింది. కాపుల ఖిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈ సారి పోటీ ఎలా ఉండబోతోంది? మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచేదెవరు? టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) జోరుకు బ్రేక్ వేసే దమ్మున్న లీడర్ ఎవరు?

పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు నియోజకవర్గం రాజకీయమే సెపరేట్. అంచనాలకు అందని విధంగా తీర్పు నివ్వడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకం.. రాజకీయంగానే కాదు సినీ రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు. అలా అని సినీ పెద్దలకు ఆదరించిన చరిత్ర ఈ నియోజకవర్గానికి లేదు. పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి.. దర్శకరత్న దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, చలం, పినిశెట్టి రవిరాజా, రేలంగి నరసింహారావు, బన్నీ వాసు (Bunny Vasu), అడ్డాల చంటి ఇలా ఎందరో ప్రముఖులు సినీ రంగంలో రాణించారు. ఇంకా రాణిస్తున్నారు. చిరంజీవి, దాసరి రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు.

సినీ పెద్దలంటే గౌరవం చూపే పాలకొల్లు వాసులు.. రాజకీయంగా మాత్రం భిన్నంగా స్పందించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే టాలీవుడ్‌లో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. సొంత ప్రాంతమని ఇక్కడి నుంచి పోటీ చేసినా.. ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు పాలకొల్లు ఓటర్లు. ఈ ఒక్క ఉదాహరణతో ఈ ప్రాంతం ప్రజల నాడి ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. అదేవిధంగా గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఏకపక్ష విజయం సాధించినా.. పాలకొల్లులో మాత్రం టీడీపీ జెండానే ఎగిరింది. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు మరోసారి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Nimmala Rama Naidu

Nimmala Rama Naidu

జిల్లాలో కాపు సామాజిక వర్గానికి కేరాఫ్ అడ్రస్ గా పాలకొల్లు నిలుస్తోంది. ఈ నియోజవర్గంలో పార్టీ ప్రభావం కంటే అభ్యర్థుల బలాబాలాలే ఎక్కువగా గెలుపును నిర్దేశిస్తున్నాయి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు.. వ్యక్తిగతంగా కష్టించి పనిచేయడంతోనే 2019లో వైసీపీ హవాలోనూ గెలవగలిగారని చెబుతుంటారు. 2024లో కూడా మళ్లీ గెలుస్తామని ధీమా ప్రదర్శిస్తోంది టీడీపీ. నియోజవర్గంలో గతంలో చేసిన అభివృద్ధే తనకు శ్రీరామ రక్ష అంటున్నారు ఎమ్మెల్యే రామానాయుడు.

Kavuru Srinivas

Kavuru Srinivas

ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు అంటూ నిత్యం జనాల్లోనే ఉంటున్నారు రామానాయుడు. మరోవైపు ప్రభుత్వం కంట్లో నలుసులా మారిన రామానాయుడిని కట్టడి చేయాలని వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత రెండుసార్లు తమకు అందని విజయాన్ని.. ఈ సారి రామానాయుడిని ఓడించడం ద్వారా అందుకోవాలని చూస్తోంది ఫ్యాన్‌ పార్టీ. సంక్షేమ పథకాలతో విజయం సాధిస్తామని చెబుతోంది. నియోజవర్గంలో వైసీపీకి గట్టి క్యాడర్ ఉంది. చాలా మంది నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నా.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్ జోరుగా తిరుగుతున్నారు. నియోజవర్గ ఇన్‌చార్జిగా ఉన్న శ్రీనివాస్ జడ్పీ చైర్మన్ గాను పనిచేశారు. దీంతో ఈ సారి పార్టీ తమకు అవకాశం ఇస్తుందని మరో సీనియర్ నేతలు గుణ్ణం నాగబాబు (Gunnam Nagababu), మేకా శేషుబాబు (Meka Seshu Babu) టిక్కెట్ ఆశిస్తున్నారు. కానీ, కార్యకర్తల్లో తనకే పట్టు ఉందని.. రామానాయుడిని ఓడించేదీ తానేనని ప్రతిజ్ఞ చేస్తున్నారు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్.

Also Read: పాయకరావుపేటలో అంతకుముందు అనితకు ఎదురైన పరిస్థితే.. ఇప్పుడు బాబురావుకు..

ఇక జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తానంటోంది. ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మరోవైపు జనసేనాని పవన్‌కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. ఐతే గత ఎన్నికల్లో మాత్రం మూడోస్థానంతోనే సరిపెట్టుకుంది జనసేన. టీడీపీతో పొత్తు ఉంటే.. జనసేన ఓట్లు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గానికి జనసేన ఇన్‌చార్జి ఎవరూ లేకపోయినా.. క్యాడర్ బలం మాత్రం చెక్కుచెదరలేదు. సరైన నాయకుడు వస్తే పాలకొల్లులో జనసేన జెండా ఎగరేస్తామంటున్నారు జనసైనికులు.

Also Read: రోజురోజుకి వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మామూలుగా ఉండదు!

ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో పాలకొల్లు స్థానం అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగానే మారింది. లక్ష 90 వేల 125 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రామానాయుడు 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బలమైన కాపునేతగా ఉన్న రామానాయుడు మరోసారి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ, జనసేన కూడా కాపు నేతలనే బరిలోకి దించే అవకాశం ఉంది. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లే విజేతలను నిర్ణయించనున్నాయి.