CM Chandrababu : పాస్ బుక్స్‌కి కరెన్సీ రేంజ్లో సేఫ్టీ ఫీచర్లు.. అత్యాధునిక భద్రత.. చంద్రబాబు చెప్పిన విషయాలివే..
CM Chandrababu Naidu : . రైతులకు అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
Passbooks to Get Currency-Level Security Features CM Chandrababu Naidu Reveals Key Details
CM Chandrababu Naidu Distributes Pattadar Passbooks To Farmers : ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన అనంతరం నల్లజెర్లలో దుర్గా భవానీ అనే మహిళా రైతుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకానికి ఎలాంటి అత్యాధునిక భద్రతను కల్పించారనే విషయాలను వెల్లడించారు.
Also Read : Balineni-Damacharla: ఒంగోలులో వేడెక్కిన రాజకీయం.. జైల్లో వేసేంత మగాడివా? దామచర్లకు బాలినేని సవాల్
పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత..
రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం బుల్లెట్ వేగంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చంద్రబాబు అన్నారు. రైతులకు అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలకు అత్యాధునిక భద్రత కల్పించామని చెప్పారు. పాస్ పుస్తకాలకు కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను అమలు చేస్తున్నామని, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని అన్నారు. క్యూఆర్ కోడ్ తో పాటు ఇతర సాంకేతిక భద్రతా ఫీచర్లను కూడా పాస్ పుస్తకాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందించామని సీఎం తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, మొత్తం 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలో 41 వేల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, 1.47 లక్షల మందికి పైగా రైతులకు పట్టాలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ఒక్క ఏలూరు జిల్లాలోనే 5,500 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు అందించినట్లు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు గతంలో కేటాయించిన భూములను 22ఏలో చేర్చిన సందర్భాలను పరిష్కరించి వారికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి రైతుకు, భూ యజమానికి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే వరకు విశ్రమించబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
2019-24 మధ్య గత పాలకుల విధ్వంసం కారణంగా భూ రికార్డులు ధ్వంసమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ఇష్టం లేని వ్యక్తుల భూములు, ఆస్తులను డిజిటల్‌గా 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి వివాదాస్పదం చేశారని విమర్శించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున భూ సమస్యలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిని పరిష్కరించాలని అప్పుడే నిర్ణయించుకున్నామని, ప్రస్తుతం అంశాల వారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంపై ఇతరుల పెత్తనం ఉండకూడదని చంద్రబాబు అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఇతరుల ఫొటోలు ఎలా వేస్తారని గత ప్రభుత్వం తీరుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ఆటో మ్యూటేషన్.. వారసత్వ భూముల బదిలీ..
భూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను 1986 నుంచి కొనసాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. లింక్ డాక్యుమెంట్లన్నింటినీ ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఇప్పటివరకు 9 లక్షల మందికి ఆటో మ్యూటేషన్ సౌకర్యం కల్పించామని వెల్లడించారు. రూ.10 లక్షల లోపు విలువైన వారసత్వ భూములను కేవలం రూ.100తో బదిలీ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రీసర్వే ప్రక్రియను రైతుల సమక్షంలోనే నిర్వహించి, ఈ-కేవైసీ పూర్తయిన తర్వాతే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తున్నామని సీఎం చెప్పారు. గ్రామ సభల ద్వారా పూర్తి పారదర్శకంగా పాస్ పుస్తకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
