Pawan Kalyan: కొత్త టెన్షన్‌.. కన్ఫ్యూజన్‍లో సేనాని.. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ

పేరుకు రెండుపార్టీలు సమన్వయంతో పనిచేయాలని చెబుతున్నా, టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా..

Pawan Kalyan: కొత్త టెన్షన్‌.. కన్ఫ్యూజన్‍లో సేనాని.. పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ

Pawan Kalyan

సీటు లెక్క తేలినా.. ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే క్లారిటీ లేక జనసేన కేడర్‌ గందరగోళం ఎదుర్కోంటోంది. ఇన్నాళ్లు ఎన్ని సీట్లు ఇస్తారనే కన్ఫూజన్‌ ఉండేది.. ఇప్పుడు ఆ కన్ఫూజన్‌ తొలగినా.. ఏ ఏ సీట్లో చెప్పకపోవడంతో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ పోటీ చేసేది తెలియక రెండు పార్టీల్లోనూ నేతలు అయోమయ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

టీడీపీ-జనసేన కూటమి తొలిజాబితా ప్రకటన తర్వాత… రెండు పార్టీల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ స్థానాలను కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ నెంబర్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన జనసేనాని పవన్‌ స్పందిస్తూ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామని కాదు.. ఎన్నిచోట్ల గెలుస్తామన్నదే ముఖ్యమని క్యాడర్‌కు హితబోధ చెప్పారు.

పొత్తు ధర్మం పాటించలేదా?
ఐతే జనసేనలో చాలా మంది నేతలు 24 సీట్లతో సరిపెట్టుకోడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పొత్తు ధర్మం పాటించలేదని కొందరు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. కానీ, అధినేత పవన్‌ సంతృప్తి చెందినప్పుడు నేతల వాదన అప్రధానంగా మారింది. ఐతే 24 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించినా, ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో చెప్పకపోవడంతో జనసేన పార్టీలో కొత్త కన్ఫూజన్‌ ప్రారంభమైంది.

అభ్యర్థుల తొలివిడత జాబితా విడుదల తర్వాత.. 24 సీట్లలో పోటీ చేస్తామని, ముందుగా 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్‌కల్యాణ్‌. రెండు రోజుల్లో మిగతా లిస్టు కూడా ఇచ్చేస్తామని చెప్పారు. ఐతే తొలిజాబితా విడుదలై రెండురోజులైనా ఇప్పటివరకు 18 నియోజకవర్గాలపై స్పష్టత లేకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.

తొలివిడత ప్రకటించిన ఐదుతోపాటు రాజోలులో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్‌ గతంలో చెప్పారు. మరీ ముఖ్యంగా జనసేనాని పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేసేది వెల్లడించకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది.

గతంలో భీమవరం, గాజువాక నుంచి..
జనసేనాని పవన్‌ గతంలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. తొలిజాబితాలో ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అదేవిధంగా పవన్‌ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల్లో పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది.

పవన్‌ పోటీ చేస్తే పిఠాపురం వదులుకుంటానని, లేదంటే తన నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించొద్దని డిమాండ్‌ చేస్తున్నారు టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక కాకినాడ రూరల్‌ నియోజకవర్గాన్ని తీసుకున్న జనసేన.. సిటీని ఆక్రమిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు అక్కడి తెలుగు తమ్ముళ్లు.

ఎక్కడి నుంచి పోటీ చేయాలనేదానిపై పవన్‌ తేల్చుకోలేకపోతున్నారా? లేక వ్యూహాత్మకంగానే తాను పోటీ చేస్తానన్న సీటును సీక్రెట్‌గా ఉంచుతున్నారోగాని… టీడీపీ కేటాయించిన నియోజకవర్గాల పేర్లను బహిర్గతం చేసినా కొంత స్పష్టత వచ్చే అవకాశాం ఉండేది.. అభ్యర్థుల ప్రకటన తర్వాత చేసినా, ముందుగా నియోజకవర్గాల పేర్లు తెలియజేస్తే సరిపోయేదానికి… అయోమయం సృష్టించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు.

సీనియర్‌ నేతలకు కూడా తమ సీట్లపై క్లారిటీ లేకపోవడంతో గందరగోళంలో పడిపోతున్నారు. రాజమండ్రి రూరల్‌ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌ను కొత్తగా నిడదవోలుకు పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చాలాకాలంగా రాజమండ్రి రూరల్‌పైనే ఆశ పెట్టుకున్నారు దుర్గేశ్‌. ఇప్పుడు కొత్తగా నిడదవోలు తెరపైకి తేవడంతో పోటీపై తర్జనభర్జన పడుతున్నారు దుర్గేశ్‌.

చాలా నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్‍
ఇదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో కన్ఫ్యూజన్‍ కనిపిస్తోంది. జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో కేవలం మూడు సీట్లనే ప్రకటించారు పవన్‌. మొత్తం 24 సీట్లలో ఏ జిల్లా నుంచి ఏ నియోజకవర్గం కేటాయించారన్న విషయమై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు మెజార్టీ జనసేన నేతలు.

అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనా.. నియోజకవర్గాలపై స్పష్టత వస్తే.. ఎన్నికల సన్నాహాలు చేసుకోవడం తేలికవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో సీట్ల కూర్పు, సర్దుబాటును అత్యంత రహస్యంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కవనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.

జనసేనకు కేటాయించిన సీట్లపై స్పష్టత రానంతవరకు సమన్వయం కూడా కుదిరే పనికాదంటున్నారు. పేరుకు రెండుపార్టీలు సమన్వయంతో పనిచేయాలని చెబుతున్నా, టీడీపీ ఆధిపత్యం ఎక్కువగా ఉందని మదనపడుతున్న జనసైనికులే ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి పవన్‌ పోటీ చేసే నియోజకవర్గంతో సహా మిగతా సీట్లను రహస్యంగా ఉంచడంపై క్యాడర్‌లో అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది.

దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్.. మోదీ హయాంలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో గేమ్ ఛేంజర్ లాంటి ప్రాజెక్టులు..