పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం.. స్పందించిన పెద్దిరెడ్డి.. ఏమన్నారో తెలుసా?

దీనిపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విచారణకు పవన్ కల్యాణ్ ఆదేశం.. స్పందించిన పెద్దిరెడ్డి.. ఏమన్నారో తెలుసా?

Peddireddy Ramachandra Reddy, Pawan Kalyan

Updated On : January 29, 2025 / 6:26 PM IST

వైఎస్సార్సీపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాలోని మంగళంపేట సమీపంలో అడవుల్లో భూకబ్జాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో దీనిపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ను పవన్‌ కల్యాణ్ ఆదేశించారు.

ఆ భూముల ఆక్రమణలతో పాటు అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలన్నారు. అలాగే, రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉందని విషయంపై కూడా విచారణ చేపట్టాలని పవన్ కల్యాణ్ తెలిపారు.

దీనిపై తిరుపతిలో మీడియాతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గతంలోనూ మదనపల్లి ఘటనపై తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. అటవీ భూములు ఆక్రమించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2001లో తాము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశామని, 1981 నవంబరు 19న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా భూములు కొనుగోలు చేశామని తెలిపారు.

తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. అక్కడ పనిచేసే వారికోసం 2001లో తాము గెస్ట్ హౌస్ కట్టామని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణ రెడ్డి ఫిర్యాదు చేశారని అన్నారు.

ఆ రోజు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదని తేల్చి చెప్పారని పెద్దిరెడ్డి తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారని చెప్పారు.

తమకు వ్యతిరేకంగా దాఖలు అయిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందని పెద్దిరెడ్డి అన్నారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారని తెలిపారు. 2022 జూన్‌ 27న బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయని చెప్పారు.

చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటారని పెద్దిరెడ్డి అన్నారు. గతంలో ఇసుక ద్వారా రూ.40 వేల కోట్లు మింగేశానని ఆరోపణలు చేశారని, ఆ తర్వాత నేపాల్‌లో తనకు సంబంధించిన ఎర్ర చందనం దొరికిందని ఆరోపించారని చెప్పారు.

మరి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంతి అయ్యి ఉండీ కూడా ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదని పెద్దిరెడ్డి నిలదీశారు. చంద్రబాబు హామీలు ఇచ్చి, ఇప్పుడు అమలు చేయలేనని తేల్చేశారని చెప్పారు.

అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని పెద్దిరెడ్డి అన్నారు. కాగా, విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం అది ఆయన సొంత విషయమని తెలిపారు. జగన్ నాయకత్వంలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

AP Tableau: ఏపీకి చెందిన శకటానికి తృతీయ స్థానం