టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే..: ఏపీ మంత్రుల కామెంట్లు

AP Politics: తుప్పుపట్టిన సైకిల్, పగిలిన గ్లాస్‌కి గోల్డ్ కోటింగ్ వేసి ప్రజల ముందుకి..

టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే..: ఏపీ మంత్రుల కామెంట్లు

Peddireddy Ramachandra Reddy

Updated On : February 24, 2024 / 5:20 PM IST

టీడీపీ-జనసేన అభ్యర్థులను చూస్తుంటే వైసీపీ ఈసారి 151 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందన్న ధీమా కలుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చురకలంటించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందన్నారు.

టీడీపీ-జనసేన కూటమికి అభ్యర్థులు లేరని పెద్దిరెడ్డి చెప్పారు. అభ్యర్థుల కోసం వెతికీ వెతికీ విసిగిపోయారన్నారు. ఆ రెండు పార్టీలతో బీజేపీ కూడా కలిసిందని వదంతులు వస్తున్నాయని చెప్పారు. చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలనూ గెలుచుకుంటామని తెలిపారు. ఈ సారి తాము కుప్పంలోనూ గెలుస్తామని చెప్పారు.

మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లకే పరిమితం కావడంపై జనసైనికులకు సమాధానం చెప్పాలని అన్నారు. మళ్లీ వైసీపీనే ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. తొలి జాబితాలో సామాజిక న్యాయం జరగలేదని, పొత్తుల వల్ల ఓటు ఏమీ మారదని అన్నారు. తుప్పుపట్టిన సైకిల్, పగిలిన గ్లాస్‌కి గోల్డ్ కోటింగ్ వేసి ప్రజల ముందుకి వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

Read Also: అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన బూరగడ్డ వేదవ్యాస్.. ఆసుపత్రికి తరలింపు