మీ పాలనలో వీటిపై ధరల బాదుడే బాదుడు: పేర్ని నాని
సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, దానికి సంబంధించిన కోర్టు ఆర్డర్‌ను చూపించాలని డిమాండ్ చేశారు.

Perni Nani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ… విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని డబ్బాలు కొట్టి, ఇప్పుడు రూ.6 వేల కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని విమర్శించారు.
కూటమి పాలనలో నిత్యావసరాల ధరలు బాదుడే బాదుడు అని పేర్ని నాని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, కోర్టు ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అసమర్థత వల్ల విద్యుత్ డిస్కంలు నష్టాల్లో ఉన్నాయని చెప్పారు.
పేరుకే ఉచిత ఇసుక అంటూ హడావిడి చేస్తున్నారని, అసలు ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా? అని పేర్ని నాని అన్నారు. ఉచిత ఇసుక అని చెప్పడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. బంగారం అమ్మినా ఇసుక దొరకడం లేదని ఎద్దేవా చేశారు. గతంకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేట్లని ఇసుక అమ్ముతున్నారని చెప్పారు.
కాకినాడలో అక్రమ బియ్యం అంటూ హడావిడి చేశారు ఇప్పుడు ఆ హడావిడి ఏమైందని పేర్ని నాని నిలదీశారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ఐదు నెలల్లో 47 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. జగన్ పాలనలో సృష్టించిన సంపదను చంద్రబాబు తన మనుషులకి దోచి పెడుతున్నారని చెప్పుకొచ్చారు.