Digital Arrest: ‘డిజిటల్ అరెస్ట్’ అంటే ఏమిటి.. ఈ మోసాలను గుర్తించడం ఎలా.. వాటి భారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులుసైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు.

Digital Arrest
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ .. గత రెండు రోజులుగా ఈ పదం విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలు ఒక్క క్షణం ఆలోచించి అడుగువేస్తే డిజిటల్ అరెస్టుల మోసం నుంచి రక్షణ పొందవచ్చునని చెప్పారు. క్షణమాగండి.. ఆలోచించండి.. ఆ తరువాతే స్పందించండి అనే దాన్ని ఒక మంత్రంగా పాటిస్తే ప్రజలు ఆన్ లైన్ స్కాములు వల నుంచి బయటపడవచ్చునని మోదీ సూచించారు. ప్రధాని మోదీ డిజిటల్ అరెస్ట్ గురించి ప్రస్తావించిన తరువాత.. డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి.. అలాంటి మోసాలను ఎలా గుర్తించాలి.. వాటి భారిన పడకుండా ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)గణాంకాల ప్రకారం.. గత కొన్నేళ్లుగా సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో అప్పటి హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లోక్ సభకు ఇచ్చిన సమాధానంలో 2023లో 11లక్షలకుపైగా పైనాన్షియల్ సైబర్ మోసాలపై ఫిర్యాదు నమోదయ్యాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యతో పాటు అదే స్థాయిలో కొత్త తరహా సైబర్ మోసాలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో డిజిటల్ అరెస్ట్ కూడా ఒకటి. ఈ క్రమంలో అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి.. వాటి భారిన పడకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read: C-295 Aircraft: భారత్‌లో తయారు కాబోతున్న సి-295 ఎయిర్‌క్రాఫ్ట్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
ఈ మధ్యకాలంలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కొత్తరకం ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోయాయి. విద్యావంతులుసైతం చాలా మంది ఇలా మోసపోతున్నారు. తద్వారా భారీగా డబ్బును పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మోసగాళ్లు జనాలను ఎలా మోసం చేయాలి.. డబ్బులు ఎలా దోచుకోవాలని కొత్తకొత్త ఎత్తులు వేస్తున్నారు. అలా మార్కెట్ లోకి వచ్చిన వారి కొత్త మోసమే డిజిటల్ అరెస్ట్. ఎవరో ఒకరు పోలీస్ లాగానో, సీబీఐ, ఈడీ అధికారిలా నటిస్తూ మీకు మెస్సేజ్ లు పంపిస్తారు. వారు మీకు కాల్ చేసే ముందు మీ బయోడేటా, మీపై ఆరోపణల చిట్టా, మీ బ్యాంక్ ఖాతాల గురించి ముందుగానే సమాచారాన్ని సేకరిస్తారు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఫోన్ చేసి డ్రగ్ కేసులోనో, మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెబుతారు. లేదంటే మీరు ఏ దేశానికో పంపించిన పార్శిల్ లో చట్టవిరుద్ధమైన వస్తువులు దొరికాయని చెబుతారు. నేను అలాంటి పార్శిల్ ఏమీ పంపలేదని చెబితే.. ఆ పార్శిల్ పై మీ ఆధార్, ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతారు. మిమ్మల్ని లైన్ లో గంటల తరబడి ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని.. రిలీజ్ చేయాలంటే, బెయిల్ కావాలంటే డబ్బు పంపించాలని చెబుతారు. అలాచేస్తే మీపై కేసు పెట్టమని చెబుతారు. ఆ వీడియో కాల్ లో మాట్లాడే సమయంలో సదరు మోసగాడు పోలీస్ యూనిఫాం లో ఉంటాడు. వారుండే ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం ఉంటుంది. దీంతో బాధితులు భయపడి డబ్బులు పంపిస్తుంటారు. ఇకఅంతే.. మీ డబ్బు స్వాహా అవుతుంది. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేదు. అయితే, ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
మోసాల భారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి..?
డిజిటల్ అరెస్ట్ మోసాల భారిన పడకుండా మూడు పద్దతులను అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పేర్కొన్నారు. మొదటగా ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ చేయాలి. రెండోది.. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్ లైన్ ద్వారా బెదిరించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది.. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలి. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రధాని మోదీ తన సందేశంలో ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు మీకు ఎదురైననప్పుడు 1930 నంబరు ద్వారా, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ https://cybercrime.gov.in/లో నమోదు చేయొచ్చునని మోదీ చెప్పారు.