సొంత పార్టీ నేతనే టార్గెట్ చేసిన పిల్లి సుభాష్, దీని వెనుక పెద్ద వ్యూహామే ఉందని టాక్

pilli subhash vs trimurthulu: తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో విభేదాలు పెరుగుతూ పోతున్నాయని అంటున్నారు. అధికార పార్టీ అనగానే పెత్తనం కోసం ప్రయత్నాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్నదీ అదే. ఒకరంటే ఒకరి పడదని పార్టీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎలాగైనా ఆధిపత్యం చలాయించాలనుకుంటున్న నాయకుల మధ్య వైరం రోజు రోజుకూ ఎక్కువ కావడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు. తాజాగా అమలాపురం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట త్రిమూర్తులు వ్యవహారంపై రాష్ట్ర హోంమంత్రికి రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
త్రిమూర్తులును టార్గెట్ చేస్తూ హోంమంత్రికి సుభాశ్ చంద్రబోస్ లేఖ:
రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎప్పటికప్పుడు వ్యవహారాలను సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. సద్దుమణిగేలా కనిపిచడం లేదని కేడర్ అంటోంది. తోట త్రిమూర్తులును టార్గెట్ చేస్తూ హోంమంత్రి సుచరితకు ఎంపీ సుభాశ్ చంద్రబోస్ ఓ లేఖ రాశారు. ఇప్పుడు ఆ విషయం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జిల్లాలోని అధికార పార్టీ నేతల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టింది.