లేపాక్షి ఆలయానికి ప్రధాని మోదీ.. పూర్వ వైభవం వస్తుందంటూ ఆశలు
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్తంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతిబింభించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం.

PM Modi To Visit Lepakshi Temple
Lepakshi Temple : చరిత్రాత్మక కట్టడం లేపాక్షి టెంపుల్. సైన్స్ కు కూడా అందని వింతలు, విశేషాలకు నిలయం అక్కడ నెలకొన్న లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించనున్నారు. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో స్థానం సంపాదించుకున్న ఈ ఆలయం ప్రధాని రాకతో పునర్ వైభవం పొందుతుందా? అని సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
సైన్స్ కూడా అందని వింతలు, విశేషాలకు పెట్టింది పేరు ఈ ఆలయం..
ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్తంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతిబింభించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సైన్స్ కూడా అందని వింతలు, విశేషాలకు ఈ ఆలయం పెట్టింది పేరు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద తాత్కాలిక జాబితాలో స్థానం దక్కించుకున్న ఈ ఆలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. దీంతో ఈ ఆలయం పేరు మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!
అలా.. లేపాక్షి అని పేరు వచ్చిందట..
విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోని శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవని పర్యాటకులు అంటుంటారు. సీతమ్మవారిని అపహరించుకొనిపోతున్న రావణుడితో యుద్ధం చేసి జటాయువు లేపాక్షిలో పడిపోయారని చరిత్ర చెబుతోంది. శ్రీరాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే..పక్షి అని మోక్షం ప్రసాదించారని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే లేపాక్షి అని పేరు వచ్చిందని అంటారు.
ఏకశిలా నంది విగ్రహం, గాలిలో వేలాడే స్థంభం..
లేపాక్షి ముఖ ద్వారంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం కూర్చున్న భంగిమలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. సందర్శకులు వేలాడే స్తంభాన్ని పదే పదే పరీక్షిస్తుంటారు. ఈ వేలాడే స్థంభాన్ని ఇతర స్తంభాలు పడిపోకుండా చూస్తాయి. గాలిలో వేలాడే స్తంభం ఈ ఆలయానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చింది.
అద్భుతాన్ని చూసి నివ్వెరపోవాల్సిందే..
స్వాతంత్ర్యానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికి మొత్తం మంటపానికి ఇదే ఆధారమని తెలుస్తోంది. ఈ వేలాడే స్తంభమే ఇక్కడ ముఖ్య ఆకర్షణగా ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకొంటోంది. ఇక్కడికి వచ్చిన వారు అందరు ఈ అద్భుతాన్ని చూసి, వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు.
Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు
ప్రధాని రాకతో పూర్వ వైభవం వచ్చేనా..
ప్రస్తుతం దేశం దృష్టి మొత్తం ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం వైపు చూస్తోంది. యునెస్కో వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్న ఈ ఆలయ దశ దిశ… ప్రధాని రాకతోనైనా మారుతుందా అని ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమైంది.