Narendra Modi: విశాఖలో మోదీ పర్యటన.. భారీ బందోబస్తు

ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Narendra Modi: విశాఖలో మోదీ పర్యటన.. భారీ బందోబస్తు

PM Modi

Updated On : January 8, 2025 / 9:15 AM IST

విశాఖలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనున్నారు. మోదీ వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉంటారు. 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్, రైల్వేజోన్, క్రిస్ సిటీ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు సుమారు కిలోమీటర్ ర్యాలీ ఉంటుంది. 45 నిమిషాలు పైగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లనున్నారు మోదీ. రోడ్ షోలోనూ మోదీ వెంట చంద్రబాబు, పవన్ ఉంటారు. ఈ మేరకు కూటమి పార్టీలు భారీ ఏర్పాట్లు చేశాయి. లక్ష మందితో ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా సన్నాహాలు చేశారు. ఓపెన్ టాప్ వాహనంలోనే నేరుగా సభా ప్రాంగణంలోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిసరాలను ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది.
5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐ.పి.ఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్.పి లు, 60 మంది డి.ఎస్.పిలు ,180 మంది సి.ఐలు, 400 మంది ఎస్ఐ.లు ఉంటారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వామపక్ష, కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులకు నోటీసులు ఇచ్చారు, పలువురిని హౌస్ అరెస్టులు చేశారు. ప్రధాని బహిరంగ సభ వేదికపై 13 మందికి అవకాశం ఉంటుంది. ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు పార్టీల అధ్యక్షులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఛాన్స్ ఉంటుంది. ప్రధాని ప్రసంగాన్ని తెలుగులోకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనువదిస్తారు.

V Narayanan: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్‌ వీ నారాయణన్‌ను నియమిస్తూ క్యాబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం