చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీతోసహా పాల్గొనే ప్రముఖులు వీరే..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అతిథులుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

Chandrababu Naidu oath taking ceremony
Chandrababu Oath Taking Ceremony : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. పవన్ కల్యాణ్ సహా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. 10వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. విజయవాడకు మూడు వేల మంది పోలీసులు, గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మంది పోలీసులు విధుల్లో ఉండనున్నారు. 60మందికిపైగా ఐపీఎస్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
Also Read : చంద్రబాబు క్యాబినెట్‌లో ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?
ప్రముఖులు వీరే..
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యం-ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖా మంత్రి జితన్ రామ్ మంజి, కేంద్ర ఆహార ఉత్పత్తుల శాఖా మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్ర రోడ్ల రవాణా-ప్రధాన రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ.రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మధ్యప్రదేష్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర స్కిల్ డెవలెప్మెంట్ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, కేంద్ర సహాయ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖా మంత్రి అనుప్రియా పాటెల్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సహాయశాఖా మంత్రి రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ ఎంపీ ప్రఫుల్ పాటెల్, మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులుకూడా పాల్గొననున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Also Read : Tollywood – Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. గన్నవరంకు తరలివస్తున్న సినీ ప్రముఖులు..
చంద్రబాబు షెడ్యూల్ ఇలా..
09:45 గంటలకు చంద్రబాబు తన నివాసం నుంచి బయలు దేరుతారు.
10:20 గంటలకు ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు చేరుకుంటారు.
11 గంటలకు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుంటారు.
11-12:30 గంటల మధ్యలో ప్రమాణ స్వీకార మహోత్సవం.
ప్రధానికి సెండాఫ్ ఇచ్చేందుకు 12:40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వెళ్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు తన నివాసానికి చేరుకుంటారు.