Simhachalam Incident: సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతులు వీరే.. సాఫ్ట్‌వేర్ దంపతులు కూడా..
సింహాచలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Simhachalam Incident
Simhachalam Incident: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.
మృతుల వివరాలు..
1.పత్తి దుర్గాస్వామీ నాయుడు(32), తూర్పుగోదావరి జిల్లా
2.కుమ్మపట్ల మణికంఠ ఈశ్వరావు శేషరావు (28), తూర్పుగోదావరి జిల్లా
3.ఎడ్ల వెంకటరావు (48), అడవివరం
4.గుజ్జరి మహాలక్ష్మీ (65), హెచ్ బి కాలనీ, వెంకోజిపాలెం.
5.పైలా వెంకటరత్నం, HB కాలనీ, ఓల్డ్ వెంకోజిపాలెం.
6.పిళ్లా మహేశ్ (30), మధురవాడ చంద్రంపాలెం.
7. పిళ్లా శైలజ (26), మధురవాడ చంద్రంపాలెం.
విశాఖపట్టణంలోని మధురవాడ చంద్రంపాలెంకు చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ భార్యాభర్తలు. సాప్ట్ వేర్ ఉద్యోగులు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది.
దిగ్భ్రాంతికి గురిచేసింది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోని సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడకూలిన ఘటనలో పలువురు మృతిచెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పవిత్రమైన అక్షయతృతీయ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం, ఈ సందర్భంలో గోడకూలి ప్రాణనష్టం జరగడం విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆవేదన కలిగించింది : మాజీ మంత్రి కేటీఆర్
ఏపీలోని సింహాచలం ఆలయంలో ప్రమాద ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలం ఘటన ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ అన్నారు.
తీవ్ర ఆవేదనకు గురిచేసింది: మంత్రి లోకేశ్
సింహాచలం ఆలయం వద్ద జరిగిన దుర్ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని, బాధితులకు మెరుగైన చికిత్స కోసం అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించాల్సిందిగా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.