PM Modi: ప్రధాని మోదీ అమరావతి పర్యటన లేటెస్ట్ షెడ్యూల్ ఇదే.. మోదీ, చంద్రబాబుతోపాటు వేదికపై కూర్చునేది వీళ్లే
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు.

PM Narendra Modi
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటనకు రానున్నారు. రాజధానిలో పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధాని పాల్గొనే సభలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
ప్రధాని పర్యటన సాగేదిలా..
♦ మధ్యాహ్నం 2.55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
♦ హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.15 గంటలకు వెలగపూడికి చేరుకుంటారు.
♦ మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదికపైకి వెళ్తారు.
♦ 3.30 గంటలకు అమరావతి పనుల పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
♦ పనుల ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ చేస్తారు.
♦ ఒక గంట 15 నిమిషాలపాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు.
♦ సాయంత్రం 4.55 గంటలకు హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి పయనం అవుతారు.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..
♦ అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలతోసహా రూ.49వేల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేస్తారు.
♦ రూ.1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రంకు, రూ. 100 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్, రూ. 293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.
♦ రూ.3,176 కోట్లతో NHAI చేపట్టే ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతోపాటు.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎనిమిది నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
వేదికపై మోదీ, చంద్రబాబుతోపాటు 19మంది..
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికి ఐదు కిలో మీటర్ల పరిధిలో నోప్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగురవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారుతు తెలిపారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కలసైతం ఇవే నిబంధనలు అమలవుతాయని తెలిపారు. ప్రధాన వేదిక ప్రధాని మోదీ సహా 19మంది ఆసీనులవుతారు. వారిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు.
పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
వాహనాల పార్కింగ్ కోసం సుమారు 256 ఎకరాలను కేటాయించారు. ప్రముఖుల వాహనాలను నిలిపేందుకు వేదిక పక్కనే పార్కింగ్ పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గాలను నిర్దేశించారు. వాటికి సమీపంలోనే వాహనాలు నిలిపేందుకు స్థలాలను కేటాయించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు సభా ప్రాంగణం వద్దకు రాలేకపోతే వారు హోల్డింగ్ ఏరియాల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు.