మహిళలని కూడా చూడలేదు : రాజధాని ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం
ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసిన మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపింది. రాత్రి అవుతున్నా విడిచిపెట్టకపోవడంతో మహిళలు ఆందోళన చెందారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్ట్‌లు చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తుళ్లూరులో మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై దర్యాప్తుకు నిజనిర్దారణ కమిటీ రాబోతోంది.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా పోరుబాట పట్టిన రైతులకు మద్దతుగా మహిళలు చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి బెంజ్ సర్కిల్ వరకూ ర్యాలీగా వెళ్లిన మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తమపై పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము చేసిన నేరమేంటో చెప్పాలని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులపై వెళ్లే వారిని సైతం పోలీసులు అరెస్టు చేస్తున్నారంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మూడు ముక్కల రాజధాని వద్దే వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ చేశారు మహిళలు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బందరు రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు, పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ మహిళలను అడ్డుకొని బలవంతంగా లాక్కెళ్లి ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో తరలించారు. మహిళల ఆందోళనతో విజయవాడలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహిళల ర్యాలీ సందర్భంగా విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అరెస్టు చేసిన మహిళలను ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపింది. ఓవైపు చీకటి పడినా.. మహిళలను విడుదల చేయలేదు. మహిళలను ఒక్కొక్కరిగా ఫొటోలు తీశారు. ఆధార్ నెంబర్, ఇంటి అడ్రస్‌లు ఇస్తేనే..విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో… పోలీసుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న తమను పోలీసులు పశువుల కన్నా హీనంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. వీళ్లు అసలు పోలీసులేనా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి సుచరిత స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
తుళ్లూరులో మహిళల మీద పోలీసుల ప్రవర్తనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఇవాళ(జనవరి 10,2020) అమరావతికి నిజనిర్ధరణ కమిటీని పంపించనున్నట్లు కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ ట్విటర్ ద్వారా తెలిపారు. తుళ్లూరు, మందడంతో పాటు మొత్తం 29 గ్రామాల్లో నిరసన తెలియజేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారీతిన దాడి చేశారని, కించపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మహిళలు ట్విటర్, ఆన్‌లైన్ ద్వారా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినందువల్లే రేఖా శర్మ స్పందించినట్లు తెలుస్తోంది. మహిళలపై దాడిని సుమోటోగా స్వీకరిస్తూ అమరావతికి కమిటీని పంపిస్తున్నట్లు ట్విటర్‌లో రేఖా శర్మ తెలిపారు.
* రాజధాని ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు
* మహిళలను మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడంపై కలకలం
* రాత్రి అవుతున్నా విడిచిపెట్టకపోవడంతో ఆందోళనపడ్డ మహిళలు
* మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్ట్‌లు చేశారని ఆగ్రహం
* తుళ్లూరులో మహిళలపై పోలీసుల తీరును ఖండించిన జాతీయ మహిళా కమిషన్
* ఇవాళ అమరావతికి వస్తున్న నిజనిర్దారణ కమిటీ
Also Read : రూ.కోటి విలువైన భూమి ధర 10లక్షలకు పడిపోయింది : జగన్ పాలన చూస్తుంటే రక్తం మరుగుతోంది