Andhra University: ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట..
ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఎలాగో అలా..

Andhra University: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. హాస్టల్ లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థినులు రోడ్డెక్కారు. గర్ల్స్ హాస్టల్ కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయని వాపోయారు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. భోజన సదుపాయాలు సరిగాలేవని ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి వార్డెన్ కు అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థినులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపట్టారు.
చీఫ్ వార్డెన్, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రాత్రి సమయంలో అమ్మాయిలు ఇలా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేయడం సరికాదని పోలీసులు నచ్చ చెప్పారు. వారందరిని లోపలికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఎలాగో అలా పోలీసులు వారిని లోపలికి పంపేశారు.
లోపల కూడా విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. కచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజుల్లోనే సమస్యలు పరిష్కరిస్తామని చీఫ్ వార్డెన్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు. తాగునీరు, భోజనం, ఇతర పరిశుభ్రతకు సంబంధించిన అంశాలపై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోయిందని అమ్మాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలకు లక్షలు ఫీజులు కట్టించుకుంటున్నా సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదని మండిపడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని విద్యార్థులు హెచ్చరించారు.