సీఎం చంద్రబాబు ఇంటి గృహప్రవేశంలో పుంగనూరు ఆవులు.. వీటి ప్రత్యేక ఏమిటో తెలుసా..? ఒక్కో ఆవు ధర ఎంతంటే..

ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి.

సీఎం చంద్రబాబు ఇంటి గృహప్రవేశంలో పుంగనూరు ఆవులు.. వీటి ప్రత్యేక ఏమిటో తెలుసా..? ఒక్కో ఆవు ధర ఎంతంటే..

punganur cows

Updated On : May 25, 2025 / 1:39 PM IST

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద నూతన గృహాన్ని నిర్మించారు. ఆదివారం తెల్లవారుజాము 4:30 గంటలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

గృహప్రవేశం సమయంలో ఆవును పవిత్రంగా భావించి ఇంట్లోకి తీసుకువస్తారు. హిందూ ఆచారాల ప్రకారం ఇంట్లోకి శుభాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. అయితే, కుప్పంలోని చంద్రబాబు నూతన ఇంటి గృహ ప్రవేశం సమయంలో పుంగనూరు ఆవులను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఏపీలోని చిత్తూరు జిల్లా ఈ జాతి ఆవులకు చాలా ఫేమస్. ఈ జాతి ఆవులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ధర భారీగా ఉంటుంది.

 

ఒంగోలు గిత్తలు, గిర్ ఆవులు.. ఇలా దేశవ్యాప్తంగా పేరుగాంచిన పశు జాతుల్లాగే పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవి. ఈ ఆవులు పొట్టిగా ఉంటాయి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని మొదటిసారి చూసినవారు మాత్రం అవి ఆవులా, దూడలా అని తికమకపడుతుంటారు.

మామూలు ఆవు దూడల సైజులో పుంగనూరు జాతి ఆవులు ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి రెండు అడుగుల నాలుగు అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. 115 నుంచి 200 కిలోల బరువు ఉంటాయి. ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి.

సంప్రదాయ వైద్యాన్ని పాటించేవారు ఈ ఆవు పాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆవు మూత్రాన్ని, పేడను కూడా కొంటుంటారు. ఈ జాతి ఆవులకు ఎక్కువ డిమాండ్ ఉంది. దీంతో వీటి ధర కూడా ఎక్కువే ఉంటుంది. ఒక్కో ఆవు ధర రూ.3 లక్షల నుంచి రూ. 5లక్షల వరకూ ఉంటుంది.