YS Jagan VS SI Video: యూనిఫామ్ నువ్వు ఇచ్చావా..? జగన్ మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పోలీసు.. వీడియో వైరల్
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Ramagiri SI Sudhakar
YS Jagan VS SI Video: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని పోలీసు ఆత్మగౌరవాన్ని కాపాడండి అంటూ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి, డీజీపీకి ఎస్ఐ విన్నవించారు.
మంగళవారం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మీడియా మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని జగన్ ఆరోపించారు. కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు వాచ్ మెన్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకూ చెబుతున్నా.. ఎల్లకాలం ఆయన పాలన సాగదు. చంద్రబాబు పాలన లేనిరోజు త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీసు అధికారికీ చెబుతున్నా.. మీ బట్టలూడదీస్తాం.. యూనిఫాం తీసి, షర్టు లేకుండా నిలబెడతాం. మీ ఉద్యోగాలు లేకుండా చేస్తామని జగన్ హెచ్చరించారు.
జగన్ వ్యాఖ్యలపై రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశారు. పోలీసుల బట్టలు ఊడతీయడానికి యూనిఫామ్ ను ఇచ్చింది నువ్వు కాదు జగన్. కష్టపడి చదివి ర్యాంకులు సంపాదించి తెచ్చుకున్న యూనిఫామ్ ఇది అంటూ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. రామగిరి ఎంపీపీ ఎన్నికలో నిష్పక్షపాతంగా పనిచేశాం. కానీ, రాజకీయ పబ్బంకోసం నువ్వు, నీ కార్యకర్తలు పోలీసులను బూతులు తిడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడండి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంశాఖ మంత్రి, డీజీపీలకు విన్నపం చేస్తున్నానని సుధాకర్ యాదవ్ అన్నారు.