ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. ఉపాధి కోసం వచ్చి విగతజీవులయ్యారు..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.

lorry overturned
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి వద్ద చెరువు కట్టపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11మందికి గాయాలు కాగా.. వారికిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ.. రెడ్డిపల్లి చెరువు కట్టపైకి రాగా మలుపు వద్ద బోల్తా పడింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టాప్‌పై కూర్చున్న కూలీలంతా మామిడి కాయల లోడు కింద పడ్డారు. కొందరు ఎగిరి దూరంగా పడటంతో గాయాలతో బయటపడ్డారు. లారీ కింద పడినవారిలో తొమ్మిది మృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. లారీలో చిక్కకున్న వారిని రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మృతులంతా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు, క్షతగాత్రులంతా రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలే. ఘటనా స్థలిని ఎస్పీ రామ్‌నాథ్ కార్గే పరిశీలించారు.
రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి జనార్దన్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.