ధూళిపాళ్ల Vs కిలారి రోశయ్య : సంఘం డెయిరీ, అమూల్ మద్య వివాదం

ధూళిపాళ్ల Vs కిలారి రోశయ్య : సంఘం డెయిరీ, అమూల్ మద్య వివాదం

Updated On : December 17, 2020 / 9:40 PM IST

Sangam Dairy, Amul Controversy : అమూల్ ఆయుధాన్ని విపక్ష నాయకుడిపై ఎక్కు పెట్టాలని చూస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యే. బినామీలతో డెయిరీని నడుపుతూ లాభాలు పంచుకుంటున్నారని ఎమ్మెల్యే అంటుంటే… కాదు కాదు నిజమైన రైతులతోనే నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే అంటున్నారు. విపక్ష నాయకుడి డెయిరీని దెబ్బతీస్తే, తనకు ఇక ఎదురే ఉండదని అధికార పార్టీ ఎమ్మెల్యే భావిస్తున్నారట. మరి చేతికి చిక్కిన అమూల్ ఆయుధం ఆధిపత్య పోరులో ఆయన్ను గెలిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాయంతో అమూల్.. ఏపిలోకి రావటంతో ఇప్పటికే ఉన్న పాల ఉత్పత్తిదారు సంఘాల భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

పాడి రైతులకు మేలు చేసేందుకే :-
అయితే పాడి రైతులకు మేలు చేసేందుకే అమూల్‌ను తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్తోన్న మాట. ఇప్పటికే కొన్ని డెయిరీలు చట్టాలను అడ్డుపెట్టుకొని పాడి రైతులకు లాభాలు రాకుండా అడ్డుకుంటున్నాయని అధికార పార్టీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఆరోపించారు. కానీ నిజమైన రైతులతో నడుస్తున్న డెయిరీని మూసివేసే దిశగా ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కౌంటర్ ఇచ్చారు. దీంతో కిలారి రోశయ్య, ధూళిపాళ్ల నరేంద్ర మధ్య మాటల యుద్దం నడుస్తోంది.
పాడి పరిశ్రమ అభివృద్ది కోసం ఏపీ ప్రభుత్వం అమూల్‌ను తీసుకొచ్చిందని… ఇప్పటి వరకూ రైతుల పేరుతో లాభాలు దండుకున్న కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు.

తక్కువ వెన్న శాతం :-
సంఘం డెయిరీలో తక్కువ వెన్న శాతం ఉన్న ఆవుపాలను 70 శాతంపైగా సేకరించి వాటికి అధిక వెన్న శాతం ఉన్న గేదే పాలను చేర్చి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ఆరోపించారు. వెన్నశాతం 10 గా ఉన్న గేదే పాలకు అధికంగా 50 రూపాయల ధరను డెయిరీలు పాల రైతులకు చెల్లిస్తుండగా… మూడు నుండి నాలుగు వెన్నశాతం ఉన్న ఆవుపాలకు ముప్పై నుండి నలభై రూపాయల మధ్య చెల్లిస్తుంటారు. అయితే సంఘం డెయిరీలో 70 శాతం ఆవుపాలకు 30 శాతం గేదే పాలను చేర్చి, పదిశాతం వెన్న ఉన్న పాలుగా మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారట. అలాగే రైతులకు బోనస్ పేరుతో క్యారేజ్ లు, హాట్ బాక్స్ లు పంచుతున్నారని… బోనస్ అంటే ఇదేనా అని ఎమ్మెల్యే కిలారి రోశయ్య ప్రశ్నించారు. సంఘం డెయిరీ రాజకీయాలకు కేంద్రంగా మారిందని చేసిన ఆరోపణలు పొన్నూరులో కాక పుట్టించాయి.

బినామీ పేర్లతో రైతులున్నారా, నిరూపించాలి :-
అయితే సంఘం డైయిరీ ఛైర్మన్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అదే స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బినామీ పేర్లతో రైతులున్నట్లు ప్రభుత్వం నిరూపించాలని ఏకంగా సవాల్ విసిరారు. అమూల్‌కు మేలు చేసేందుకే ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సంఘం డెయిరీపై ఆరోపణలు చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఆవు పాలను సేకరించి అధిక ధరకు అమ్ముతున్నారని ఆరోపణలు చేయడంపై ఆధారాలు చూపాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. అమూల్ అత్యధికంగా ఆవు పాలనే సేకరించి విక్రయిస్తుందన్నారు.

ఆధిపత్యం కోసం ప్రయత్నాలు :-
మరి అమూల్ విషయంలో లేని అభ్యంతరాలు సంఘం డెయిరీకి ఎందుకు వర్తిస్తాయని ధూళిపాళ్ల ప్రశ్నించారు. బోనస్లు పంచడం అన్న అంశం స్వయం ప్రతిపత్తి కలిగిన సొసైటీలు నిర్ణయం తీసుకుంటాయని ధూళిపాళ్ల గుర్తుచేశారు. లాభాలను తాము మాత్రం నగదు రూపంలో అందిస్తామని వాటిని స్థానికంగా ఉన్న సొసైటీలు అందిస్తాయని చెప్పారు. సంఘం డెయిరీ వ్యవస్థీకృతంగా బలంగా ఉందని అమూల్‌కు సైతం ఎదుర్కొకలిగే సత్తా సంఘం డెయిరీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అటు సంఘం డైరీతో ధూలిపాళ నరేంద్ర ఇటు అమూల్‌తో కిలారి రోశయ్య ఆదిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.