Yanamala: అందుకే ఫిరాయింపుదారులు అనర్హత నుంచి విముక్తి పొందుతున్నారు: సుప్రీంకోర్టు తీర్పుపై యనమల
"స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్లను పరిష్కరించడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. సభాపతి నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవు" అని అన్నారు.

అసెంబ్లీ స్పీకర్ ముందు ఉన్న పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయని చెప్పారు.
అమరావతిలో యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ… “ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసుగులను సమీక్షించి చట్ట సవరణల ద్వారా సరిదిద్దాలి. స్పీకర్ ముందు దాఖలైన పిటిషన్లను పరిష్కరించడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. సభాపతి నిర్ణయం వెలువడే వరకు కోర్టులు జోక్యం చేసుకోలేవు.
అనేక శాసనసభలలో ఈ రకమైన పిటిషన్లు అపరిమితంగా పెండింగ్‌లో ఉన్నాయి. అందుకే ఫిరాయింపుదారులు అనర్హత నుంచి విముక్తి పొందుతున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత, కోర్టులు అటువంటి నిర్ణయాలపై జోక్యం చేసుకుని న్యాయపరంగా తమ తీర్పులను ఇవ్వవచ్చు” అని అన్నారు.