స్వామి కార్యమా? స్వకార్యమా? : పవన్ ఢిల్లీ టూర్ వెనుక కారణం అదేనా..?

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 03:18 PM IST
స్వామి కార్యమా? స్వకార్యమా? : పవన్ ఢిల్లీ టూర్ వెనుక కారణం అదేనా..?

Updated On : January 14, 2020 / 3:18 PM IST

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యవహారశైలి ఎవరికీ అర్థం కావడం లేదు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అమరావతిలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక రోజు పవన్‌ కల్యాణ్‌ హాజరై రైతులకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అమరావతి వచ్చి సభలో మాట్లాడుతూ మధ్యలో సడన్‌గా మాయమైపోయారు. అర్జెంట్‌గా ఢిల్లీ వెళ్లాలంటూ జంప్‌ అయిపోయారు. అసలు ఢిల్లీలో పవన్‌కు ఏం పని ఉందబ్బా అని జనసేన కార్యకర్తలకే కాదు.. మామూలు జనాలకు కూడా తెలియడం లేదు. పోనీ దానికి సంబంధించిన విషయాలేవైనా బయట పెడతారా అంటే అదీ లేదు.

రాజధాని గురించి మాట్లాడేందుకే ఢిల్లీ వెళ్లారా?
ఢిల్లీలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ ఫిక్స్ అయ్యిందని, వారిని కలుసుకోవడానికి వెళ్తున్నారనే వార్తలొచ్చాయి. అసలు ఇప్పుడు మంత్రులతో ఏ విషయం మాట్లాడడానికి పవన్‌ వెళ్తున్నారంటే మాత్రం ఎవరికీ తెలియదు. దీంతో పవన్‌ కల్యాణ్‌ తీరుపై రకరకాలు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఢిల్లీకి వెళ్లారు.. వచ్చారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. అప్పట్లో కూడా కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ పవన్‌కు దొరకలేదు. ఏపీ రాజధాని విషయంలో మాట్లాడేందుకు వెళ్తున్నారనుకున్నా.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తే ఓ పద్ధతి. కానీ, పవన్‌ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారనేదే తెలియడంలేదంటున్నారు.

పిలిచారా..? స్వయంగా వెళ్లారా..?
అసలు ఢిల్లీలోని కేంద్ర పెద్దలు పవన్‌ను పిలిచారా? లేదంటే పవన్‌ తనంతట తానుగా వెళ్లారా? ఇలాంటి ప్రశ్నలు జనాన్ని, పార్టీని వేధిస్తున్నాయి. ఆయన పర్యటనంతా రహస్యంగా సాగుతోంది. ఒకవేళ రాజధాని కోసమే పవన్ ఢిల్లీ వెళ్లిఉంటే.. అంత గోప్యత ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు ఢిల్లీలో ఆయన ఎవరెవరితో భేటీ అయ్యారన్న దానిపైనా మీడియాకు సమాచారం లేదు. ఈ క్రమంలో పవన్ పర్యటనపై మరో ప్రచారం జరుగుతోంది. అసలు పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని.. శనివారం రాత్రి నుంచి ఢిల్లీలో ఆయన నిరీక్షిస్తున్నారని సమాచారం.

ఏపీ బీజేపీ నేతలకు లేని శ్రద్ధ పవన్‌కు ఎందుకు..?
మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం పవన్‌ కల్యాణ్‌ను ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. జనసేన అధినేతకు మంత్రులు షాకిచ్చారని చెప్పుకుంటున్నారు. గత పర్యటనలోనూ ఆయన ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారని సెటైర్లు వేస్తున్నారు. అసలు పవన్‌ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వెళ్లారనేది స్పష్టత రావడం లేదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అంశాలు, అమరావతి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులన్నీ ఆయన కేంద్రానికి వివరించడానికి ఢిల్లీ వెళ్లారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఆయనకేమో అసలు అపాయింట్‌మెంటే దొరకలేదని జనాలు అనుకుంటున్నారు.

ఆర్ఎస్ఎస్ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను వివరించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కానీ, బీజేపీ నాయకులకు లేని శ్రద్ధ పవన్‌కు ఎందుకబ్బా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయనకు కమలం పార్టీ పెద్దలెవ్వరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదట. 

Also Read : ఎట్టకేలకు బాబు వస్తున్నాడు : రేపు రాజధాని గ్రామాల్లో బాలకృష్ణ పర్యటన