Seethanagaram Gang Rape Case : సీతానగరం గ్యాంగ్ రేప్ కేసు, పోలీసుల అదుపులో కీలక నిందితుడు

రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు.

Seethanagaram Gang Rape Case : సీతానగరం గ్యాంగ్ రేప్ కేసు, పోలీసుల అదుపులో కీలక నిందితుడు

Seethanagaram Gang Rape Case

Updated On : August 7, 2021 / 10:55 AM IST

Seethanagaram Gang Rape Case : రాష్ట్రంలో సంచలనం రేపిన సీతానగరం సామూహిక అత్యాచారం కేసులో ఎట్టకేలకు గుంటూరు అర్బన్ పోలీసులు పురోగతి సాధించారు. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నారు. పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగి గాలించి మరీ పట్టుకున్నారు. నిందితుడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఓ జంట ఈ ఏడాది జూన్‌లో సాయంత్రం వేళ గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల దగ్గర సేద దీరేందుకు వెళ్లింది. వీరిని చూసిన నిందితులు జంటపై దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. నిందితులను వెంకటరెడ్డి, షేర్ కృష్ణగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరు ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది.

దీంతో పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగారు. సమోసాలు అమ్మేవారిలా, ఫుడ్ డెలివరీ బాయ్స్‌లా మారి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు గంజాయి తాగే అలవాటు ఉండడంతో అది తాగే ప్రదేశాల్లోనూ కాపుకాశారు. ఈ క్రమంలో నిందితుడు కృష్ణ హైదరాబాద్‌లో క్యాటరింగ్ పనులు చేస్తూ రైల్వే బ్రిడ్జి కింద తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు షేర్ కృష్ణను అదుపులోకి తీసుకున్నాయి.

అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. మరో నిందితుడు చెన్నైలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసు బృందాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. కాగా, విచారణ అనంతరం నిందితుడి అరెస్ట్‌ను అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.