Heat Wave : నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
Heat Wave : మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Telangana Heat Wave
AP Telangana Heat Wave : ఎండలు మండిపోతున్నాయ్. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓవైపు ఎండవేడి, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వడగాల్పులు.. దెబ్బకు జనాలు విలవిలలాడిపోతున్నారు. మాడు పగిలే ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న దుస్థితి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ.. రెండు చోట్ల ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి.
పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉక్కపోతతో సతమతం అవుతున్నారు. తెలంగాణకు వార్నింగ్ విడుదల చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందంది.
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు..
ఇక, వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించారు. ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే, వ్యాధులు సోకే అవకాశం కూడా ఉంది. అందుకే వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది. సాధ్యమైనంత వరకు ప్రతీ ఒక్కరు 4 నుంచి 5 లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ కు బదులుగా మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వారు నిమ్మరసం తీసుకోవడం మంచిదన్నారు.
వేసవిలో తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు..
వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కర్బూజ, కీరా దోస.. ఇలా నీరు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు నల్లటి దుస్తులు ధరించొద్దు. బాగా వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప సాధ్యమైనంతవరకు ఇంటి పట్టునే ఉండటం మంచిది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం 11 గంటల లోపు పనులు పూర్తి చేసుకోవాలి. బయటకు వెళ్లే వారు ఎండ నుంచి రక్షణ కోసం కూలింగ్ గ్లాసెస్, టోపీ, హెల్మెట్, గ్లౌజ్ లు వాడాలి. బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మసాలతో వండిన ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.