SIR Tension In AP : SIR కలకలం.. ఏపీలో అన్ని పార్టీల్లో టెన్షన్.. ‘సర్’పై ఎందుకీ అనుమానాలు.. నిబంధనలు ఏంటి?
SIR Tension In AP : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-S.I.R. ఏపీలో అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది.
SIR Tension In AP
SIR Tension In AP : అధికార పార్టీ అయినా.. అపోజిషన్ లీడర్లు అయినా ఇప్పుడు అందరికీ ఒకటే ఫోబియా. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి.. బెంగాల్లో దీదీకి చుక్కలు కనిపిస్తున్నాయి. అటు టీఎంసీ, ఇటు డీఎంకే ఓడటమే కాదు.. రెండు పార్టీల అధినేతలు సీఎంగా ఉండి సొంత సీటులో ఓటమి చవిచూశారు. ఇదంతా సరే. ఆ స్టేట్స్లో వాళ్లిద్దరు ఓడితే.. ఏపీలో పార్టీలకు, లీడర్లకు టెన్షన్ ఎందుకనే కదా డౌట్. అక్కడికే వస్తున్నా.. కేంద్రం చేపట్టిన S.I.R ప్రక్రియే.. బెంగాల్లో గెలుపోటముల్ని డిసైడ్ చేసిందన్న ప్రచారంతో ఢిల్లీ టు అమరావతి.. ఆ సర్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అపోజిషన్‌లో వైసీపీ అయితే ఫుల్ అటెన్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. అందరికంటే ముందే S.I.Rపై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహించిన జగన్.. లీడర్లకు దిశానిర్ధేశం చేశారు. అలర్ట్‌గా ఉండాలని.. ఎక్కడా తమ పార్టీకి చెందిన ఓటర్ల ఓట్లు పోకుండా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు.
Also Read : JanaSena Party : పార్టీ బలోపేతంపై పవన్ ఫోకస్.. చేరికలకు గ్రీన్‌సిగ్నల్.. వైసీపీ నుంచి జాయినింగ్స్!
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-S.I.R. మరణించిన, చిరునామా మారిన, అలాగే డూప్లికేట్ ఓట్లను తొలగించడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం సర్ ముఖ్య ఉద్దేశం. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేసుకుంటూ, తాజా ఓటర్ల వివరాలు సేకరిస్తూ వస్తున్నారు. బూత్ లెవల్ అధికారులు డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. ఏపీలో ఈ నెల 15న మొదలైన ఈ ప్రక్రియ వచ్చే నెల 15 వరకు.. నెలరోజుల పాటు కొనసాగుతుంది. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటికి వచ్చినప్పుడు ఓటర్లు లేకపోతే అంతే సంగతులు. ఈ మాటే అటు పార్టీలకు.. ఇటు లీడర్లకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తోంది.
గత డిసెంబర్లో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ ఏడాది జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్న వాదన బలంగా ఉంది. S..I.R ప్రక్రియనే కొందరు ముఖ్యనేతల తలరాతలను మార్చేసిందన్న టాక్ వినిపిస్తోంది. సర్ ప్రక్రియ కింద ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 97లక్షల ఓట్లు తొలగించినట్లు అంచనా. ఈ ఓట్లు తొలగింపు దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఏకంగా లక్షకు పైగా ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించారు. ఆయన కొలత్తూరులో 8వేల 795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పెద్దఎత్తున జరిగిన ఓట్లు తొలగింపే కొలత్తూరులో స్టాలిన్‌ను ఓటమి పాలు చేసిందని బలంగా నమ్ముతున్నారు డీఎంకే నేతలు.
ఇక పశ్చిమ బెంగాల్లో 91 లక్షలకు పైగా ఓట్లు డిలీటయ్యాయి. ఆ స్టేట్‌లోని మొత్తం ఓట్లలో ఇది దాదాపు 12 శాతం. ఒక్క ఓటుతోనే నేతల జాతకాలు, తలరాతలు మారుతున్న పరిస్థితి. అలాంటిది 12 శాతం ఓట్లు లేకుండా పోతే..రిజల్ట్ షాకింగ్‌గా ఎందుకుండవన్న చర్చ జరుగుతోంది. బెంగాల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 స్థానాల్లో గెలుపు మార్జిన్ కంటే, అక్కడ తొలగించిన ఓట్లే ఎక్కువ. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో 50 వేల ఓట్లు డిలీట్ అయ్యాయట. ఆమె 15 వేల ఓట్లతో ఓడిపోయారు. ఆ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల తొలగింపు..ఫలితాలు తారుమారైన సీన్‌ను గుర్తు చేసుకుంటే చాలు..ఏపీల పార్టీలకు వణుకు పుడుతోందట.
బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు ముందు S.I.Rపై ఏ పార్టీ పెద్ద సీరియస్‌గా కాన్సన్ట్రేట్ చేయలేదు. వన్స్ అక్కడ సీన్ మారిపోవడంతో ఏకంగా వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌ను అలర్ట్ చేస్తున్నాయి పార్టీలు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా ప్రతిపక్ష నేతలు తమ అనుచరులను.. సర్ ప్రక్రియ చేపడుతున్న సిబ్బంది వెంట తిప్పుతున్నారు. బూత్ లెవల్ ఏజెంట్లను యాక్టివ్ చేస్తున్నారు. ఏ ఓటు తీసేస్తున్నారు.? ఏ ఓటు కలుపుతున్నారన్న దానిపై నాయకులు ఏ రోజుకు ఆ రోజు డేటా తెప్పించుకుని పరిశీలిస్తున్నారట. ముఖ్యంగా గత ఎన్నికల్లో తక్కువ మార్జిన్‌తో అంటే ఐదు నుంచి పదివేలలోపు ఓట్ల తేడాతో విజయం సాధించిన నేతల గుండెల్లో ఎస్ఐఆర్ గుబులు రేపుతోందట. ఈ ప్రక్రియ వచ్చే ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న కంగారు నాయకుల్లో మొదలైంది.
అర్బన్ ఏరియాల్లో కంటే రూరల్ ఏరియాలోని దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ఓటర్లు ఉపాధి కోసం లేక వివిధ పనుల నిమిత్తం దగ్గరలో ఉన్న నగరాలకు వెళ్తుంటారు. సర్ ప్రక్రియ కోసం సిబ్బంది ఇంటికి వెళ్లినప్పుడు..డోర్ లాక్ చేసి ఉంటే ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. తాము ఊర్లోనే నివసిస్తున్నామని రుజువు చూపిస్తే తప్ప ఓటు నిలబడే అవకాశం లేదట.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలువురు అధికార పార్టీ నేతలు అయితే ఎన్నికల సిబ్బంది వెంట తమ షాడో టీమ్‌లను పంపిస్తున్నారు. తమకు అనుకూలమైన ఓటర్లను తొలగించడానికి సిద్ధపడితే వెంటనే అడ్డు చెబుతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి కూడా ఇది కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తమ ఓట్లను కాపాడుకునేందుకు ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు ఈ నెల రోజులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఏపీలో సర్ ప్రక్రియ ముగిసేలోపు ఎన్ని ఓట్లు గల్లంతవుతాయోనన్న భయం నాయకులను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో తక్కువ మార్జిన్‌తో ఓడిపోయిన వారిలోనే కాకుండా, తక్కువ మార్జిన్‌తో గెలిచిన వారిపై కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి.
