Smart Rice Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లోని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు.. వీటి వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసా..?
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దశల్లో క్యూఆర్ కోడ్ తో కూడిన కోటి 45లక్షల స్మార్టు రేషన్ కార్డుల (smart rice cards) ను ప్రభుత్వం అందజేయనుంది.

smart rice cards
Smart Rice Cards : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇదే క్రమంలో రేషన్ సరఫరాలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు దశల్లో క్యూఆర్ కోడ్ తో కూడిన కోటి 45లక్షల స్మార్టు రేషన్ కార్డుల (smart rice cards) ను ప్రభుత్వం అందజేయనుంది.
అక్రమాలకు చెక్ పెట్టేలా..
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పేదలకు నిర్దేశించిన రేషన్ పక్కదారి పట్టకుండా పలు చర్యలు చేపడుతుంది. ఎండియు వ్యవస్థ రద్దు, చౌక డిపోల్లోనే సరుకులు తీసుకోవడం పునరుద్ధరణ, కొత్త రేషన్ కార్డులు జారీ, క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్టు రేషన్ కార్డులు సహా పలు కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలోనే కొత్తగా రూపొందించిన స్మార్టు కార్డుల పంపిణీని ప్రభుత్వం అట్టహాసంగా చేపట్టబోతోంది. తొలి విడతగా కొన్ని జిల్లాల్లో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించనున్నారు.
విడతల వారిగా పంపిణీ..
స్మార్ట్ రేషన్ కార్డులను జిల్లాల వారిగా లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. తొలి విడతలో సోమవారం (25వ తేదీ) నెల్లూరు, విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్టణం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో పంపిణీ చేస్తారు.
ఈనెల 30వ తేదీ నుంచి రెండో విడతలో గుంటూరు, ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంపిణీ ఉంటుంది.
సెప్టెంబర్ 6వ తేదీ నుంచి మూడో విడతలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నారు.
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నాల్గో విడతలో శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. మొత్తం నాలుగు విడతల్లో సెప్టెంబర్ నెల చివరి నాటికి రాష్ట్రంలోని రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
నిరంతరం పర్యవేక్షణ..
♦ స్మార్టు కార్డు లబ్ధిదారునికి చేరే వరకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది.
♦ ప్రతి దశలో డిజిటల్ ఎకనాలెడ్జ్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
♦ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో తహసీల్దార్, సహాయ పౌరసరఫరాల అధికారులు రేషన్ డీలర్లకు స్మార్టు కార్డులు అందజేస్తారు.
♦ వాటిని పౌరసరఫరాల శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ లో లాగిన్ అయ్యి వివరాలు పొందుపర్చాలి.
♦ ఆ తరువాత రేషన్ డీలరు తన పరిధిలోని కార్డు దారులకు గ్రామ లేదా వార్డు సచివాలయం ఉద్యోగుల సహకారంతో పంపిణీ చేస్తారు.
♦ ప్రతి రేషన్ షాపుకు కేటాయించిన స్మార్టు కార్డులను అక్కడికే వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది.
♦ రేషన్ తీసుకునేందుకు పోర్టబులిటీ అవకాశం ఉన్నప్పటికీ రేషన్ కార్డులు మాత్రం మ్యాపింగ్ చేసిన దుకాణంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
♦ గ్రామ లేదా వార్డు సచివాలయం ఉద్యోగులు కార్డుదారునికి రేషన్ స్మార్ట్ కార్డు అందించిన వెంటనే ఓటీపీ లేదా ఫేస్ రికగ్నేషన్ ద్వారా డిజిటల్ ఎకనాలెడ్జిమెంట్‌ను తీసుకొని అధికారులకు వివరాలు పంపాల్సి ఉంటుంది.
♦ వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి స్మార్టు కార్డులను నేరుగా అందించనున్నారు.
స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల ఉపయోగాలు ఇవే..
♦ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది.
♦ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఈ కార్డుతో రేషన్ సరుకులు పొందొచ్చు.
♦ రేషన్ షాపుల్లో రద్దీ తగ్గి, సరుకుల పంపిణీ వేగంగా జరుగుతుంది.
♦ వేగవంతమైన సరఫరాకు తోడు మోసాలకు అడ్డుకట్ట పడనుంది.
♦ లబ్ధిదారులకు రావాల్సిన సరుకులు ఇతరుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుంది.
♦ అత్యవసర సమయాల్లో అధికారిక ఐడీ కార్డులాగా ఉపయోగపడుతుంది.