AP Legislative council : ఏపీ శాసనమండలి నుంచి 8 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేశారు.

Ap Legislative Council
AP Legislative council : రెండు రోజులకు ముందు సభలో విజిల్స్ వేశారు.. ఆ తర్వాత సభలోకి చిడతలు తెచ్చారు..! ఇవాళ ఏకంగా తాళిబొట్లతో నిరసనకు దిగారు. ఏపీ ఉభయ సభల్లో రోజుకో రకంగా నిరసన తెలుపుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులు ఇవాళ ఉభయ సభల్లోకి తాళి బొట్టులు తెచ్చారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ చేస్తూ తాళిబొట్లు ప్రదర్శించారు.
టీడీపీ సభ్యుల తీరుపై శాసనసభ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో తాళిబొట్టు ప్రదర్శిస్తున్న బచ్చుల అర్జునుడు చేతిలో నుంచి వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తాళిబొట్టు లాగేసుకున్నారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో 8 మంది ఎమ్మెల్సీలను మండలి నుంచి ఛైర్మన్ సస్పెండ్ చేశారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని పట్టుపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. పోడియం వద్దకు చేరుకుని తాళిబొట్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసస్తూ టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి వాకౌట్ చేశారు.
అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి సభల టీడీపీ ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. రోజుకో విధంగా సభలో నిరసనలు వ్యక్తం చేస్తూ సస్పెన్షన్కు గురవుతున్న టీడీపీ సభ్యులు… ఇవాళ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.