Tadepalli Case : కృష్ణానది ఘాట్..అత్యాచారం కేసు, బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత పరామర్శించారు. యువతికి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Tadepalli
AP Home Minister : గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఘాట్ ప్రాంతంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. అయితే…రాజకీయంగా దుమారం రేపుతోంది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత పరామర్శించారు. యువతికి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు పరిహారం అందజేస్తున్నట్టు తెలిపారు. నిందితులెవరైనా కఠినంగా శిక్షిస్తామన్నారు ఏపీ మంత్రులు. సీతానగరం బాధితులకు ధైర్యం చెప్పకుండా లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఆ జంటకు అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు.
మరోవైపు..అత్యాచారం ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ దాడి అత్యంత హేయం, బాధాకరం అన్నారు. నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు పూర్తి రక్షణ ఉంటుందన్నారు సవాంగ్. విజయవాడతో పాటు గుంటూరు జిల్లా పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశామని గుంటూరు జిల్లా అర్బన్ ఏఎస్పీ తెలిపారు. ఇంకా నిందితులు ఎవరన్నది నిర్ధారణ కాలేదని తెలిపారు. ఎవరినీ ఇంకా అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.
సీతానగరంకు చెందిన ఓ యువతి కాబోయే భర్తతో పాటు కాసేపు పుష్కర్ ఘాట్ వద్ద సేద తీరేందుకు వెళ్లింది. ఆ సమయంలో కొంతమంది కేటుగాళ్లు.. వారిపై దాడి చేసి యువకుడి బంధించారు. ఆ తర్వాత యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 12 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.