Chandrababu Naidu : 150 సీట్లు మార్చినా గెలవరు- వైసీపీలో మార్పులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్సఫర్ చేయలేదు అని అడిగారు.

Chandrababu Naidu On YSRCP (Photo : Google)
వైసీపీలో అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, సీట్ల మార్పులు చేర్పులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదని చంద్రబాబు జోస్యం చెప్పారు. జగన్ లెక్కలు తారుమారయ్యాయని చంద్రబాబు అన్నారు. జగన్ 11 మందికి సీట్లు మార్చేశారని చెప్పారు. ఏకంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్రాన్సఫర్లు ఉంటాయని అస్సలు ఊహించలేదన్నారు చంద్రబాబు. ఓ చోట చెల్లని కాసు.. మరో చోట ఎలా చెల్లుబాటు అవుతుంది? అని వైసీపీలో ఇంఛార్జిల మార్పులపై చంద్రబాబు కామెంట్ చేశారు.
Also Read : బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా ప్యాకేజీ స్టార్‌కి రాలేదు: జగన్
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారు..
దళితులు, బీసీలనే జగన్ బదిలీ చేశారని చంద్రబాబు ఆరోపించారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే.. అక్కడ బీసీ అభ్యర్థిని నిలపొచ్చు కదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంతమందిని బదిలీలు చేసిన జగన్.. బాలినేని, ద్వారంపూడి, పెద్దిరెడ్డి వంటి వారిని ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదని అడిగారు. జగన్ తన మనుషులను, బినామీలను ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేయలేదు..? అని నిలదీశారు చంద్రబాబు. పేదవారి సీట్లే మారుస్తారా? అని అడిగారు. ఏది ఏమైనా 150 సీట్లు మార్చినా వైసీపీ గెలవదని తేల్చి చెప్పారు చంద్రబాబు.
ఇప్పటికే ప్రజల్లో చాలా మార్పు వచ్చింది..
5కోట్ల ప్రజలు వర్సెస్ సైకో జగన్ అనే నినాదంతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విన్యాసాలు, నాటకాలేస్తే ప్రజలు నమ్మరని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్రజల్లో చాలా మార్పు వచ్చిందన్న చంద్రబాబు.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మరింత మార్పు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : విశాఖపై పట్టు పెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?
మార్పునకు నాంది పలకాలని ప్రజలకు పిలుపు
అందరి అభిప్రాయాలతోనే తమ పార్టీ అభ్యర్ధులను నిలబెడతామన్నారు చంద్రబాబు. ప్రజలంతా సహకరించాలని కోరారు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అందరూ సహకరించాలని, మార్పునకు నాంది పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ అభ్యర్ధులకు తాడేపల్లి ఆమోదం.. టీడీపీ అభ్యర్థులకు ప్రజామోదం ఉందన్నారు చంద్రబాబు.