జగన్ పేషీలో పని చేసిన ఆ ముగ్గురు అధికారులపై బదిలీ వేటు.. సీఎంవో పేషీలో చంద్రబాబు ప్రక్షాళన

ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ముగ్గురు అధికారుల బదిలీలతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది.

జగన్ పేషీలో పని చేసిన ఆ ముగ్గురు అధికారులపై బదిలీ వేటు.. సీఎంవో పేషీలో చంద్రబాబు ప్రక్షాళన

Updated On : June 8, 2024 / 7:23 PM IST

Chandrababu On CMO Team : పాలనాపరమైన పగ్గాలు చేపట్టేలోపు తన టీమ్ ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. ఇప్పటికే సీఎస్ గా నీరభ్ కుమార్ ను నియమించుకున్న చంద్రబాబు.. సీఎంఓ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎంవోలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు సీఎస్. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆ ముగ్గురిని ఆదేశించారు. దీంతో సీఎంవో మొత్తం ఖాళీ అయ్యింది. కొత్తగా నియామకాలు జరగాల్సి ఉంది.

మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాల రాజు, అఢిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ముగ్గురు అధికారుల బదిలీలతో జగన్ పేషీ ఖాళీ అయ్యింది. ముగ్గురు బదిలీ అయిన అధికారుల స్థానంలో ముద్దాడ రవిచంద్ర, సాయి ప్రసాద్, గిరిజా శంకర్, విజయానంద్ లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన పొలిటికల్ సెక్రటరీ పోస్టుపై వడపోత కార్యక్రమం జరుగుతోంది.

అయితే, సీఎస్ గా నియామకమైన నీరభ్ కుమార్ ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆయనను కొనసాగిస్తారా? లేక మరొకరికి అవకాశం ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. నీరభ్ కుమార్ రిటైర్డ్ అయితే ఆ స్థానంలో విజయానంద్, రజత్ భార్గవ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రజత్ భార్గవ 2 నెలల్లో రిటైర్ కానున్నారు.

అటు, పూనం మాల కొండయ్య ఈ నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ డిసెంబర్ లో రిటైర్ అవుతారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితురాలు అన్న ముద్ర ఉంది. దీంతో ఆమెను పూర్తిగా పక్కన పెడతారని తెలుస్తోంది.

Also Read : కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన