విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!

డీసీసీబీ ఛైర్మన్‌ పోస్ట్‌ విషయంలో ఆనంద్‌ వర్గం పైచేయి సాధిస్తుందా?

విజయనగరం డీసీసీబీ పీఠంపై తెలుగు తమ్ముళ్ల ఎత్తులు.. తమకు అనుకూలంగా ఉండే నేతకు పదవి దక్కేలా లాబీయింగ్..!

TDP

Updated On : January 30, 2025 / 7:54 PM IST

విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‌ పీఠం కోసం జోరుగా పావులు కదుపుతున్నారు నేతలు. నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత, రైతు కుటుంబ నేపథ్యం ఉన్న కడగల ఆనంద్ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. కడగల ఆనంద్‌ ఫ్యామిలీ ఏళ్లుగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు.

కానీ, రాజకీయ కారణాల వలన అది సాధ్యంకాలేదు. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉంటున్నా ఈ కుటుంబానికి పదవులు వరించడం లేదు. దీంతో ఈ సారి డీసీసీబీ ఛైర్మన్ పదవి కోసం కలవని నేత, ఎక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈయన ప్రయత్నాలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

చీపురుపల్లి టీడీపీ సీనియర్ నేత త్రిమూర్తుల రాజు పేరును ఎంపీ అప్పలనాయుడు తెరపైకి తీసుకొచ్చినట్లు టాక్. ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రమేయం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అశోక్ గజపతిరాజుతో సంప్రదింపులు జరిగాకే, త్రిమూర్తుల రాజు పేరును ఎంపీ కలిశెట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ పదవి కోసం రెండు వర్గాలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ప్రభుత్వ పథకాల విషయంలో క్లారిటీ మిస్సయ్యిందా? గ్రామసభల్లో గొడవలకు సమాచార లోపమే కారణమా?

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉండే పదవి
డీసీసీబీ చైర్మన్ పోస్ట్‌ అంటే జిల్లాలో పొలిటికల్ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉండే పదవి. మాజీమంత్రి బొత్స వంటి నేతలకు రాజకీయ పునాది పడింది ఇక్కడ నుంచే. డీసీసీబీ డైరెక్టర్‌గా, ఛైర్మన్‌గా పనిచేసిన బొత్స, ఆపై రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. అప్పటి నుంచి ఈ పదవి అంటే రాజకీయంగా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన కడగల ఆనంద్ ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంద్‌ను కాదని, త్రిమూర్తుల రాజు పేరు ఎంపీ కలిశెట్టి తెరమీదకు తీసుకురావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

డీసీసీబీ ఛైర్మన్‌గా కడగల ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్లే, ఇక జాబితా విడుదల అవడమే ఆలస్యం అని అంతా ఎదురుచూస్తోన్న తరుణంలో త్రిమూర్తుల రాజు పేరు బయటకు రావడం వెనుక ఆనంద్ వర్గం ఆందోళన చెందుతోందట. అయితే ఎంపీ కలిశెట్టి.. త్రిమూర్తుల రాజును తెరపైకి తేవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత కళా వెంకట్రావుకు చెక్ పెట్టేందుకే ఎంపీ కలిశెట్టి ఈ విధమైన స్టెప్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

వీరి మధ్య ఆధిపత్యపోరు
ఎన్నికల ముందు వరకు కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య తీవ్ర రాజకీయ శత్రుత్వం నడిచింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వీరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగింది. మరో పక్క అశోక్ గజపతిరాజుతో కూడా కళా వెంకట్రావుకు రాజకీయ విబేధాలున్నాయి. ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావుకు రాజకీయంగా చెక్ పెట్టాలనే ఆలోచనతోనే త్రిమూర్తుల రాజు పేరును తెరపైకి తీసుకొచ్చారట.

త్రిమూర్తుల రాజు, చీపురుపల్లిలో బలమైన సీనియర్ నాయకుడు. ఎన్నికల సమయంలో ప్రతీసారి టికెట్ రేసులో ఆయన పేరు వినిపిస్తుంటుంది. అయితే సామాజిక వర్గం ఈయనకు మైనస్‌గా మారింది. ఇప్పుడు డీసీసీబీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం ద్వారా తమ ఉమ్మడి రాజకీయ శత్రువైన ఎమ్మెల్యే కళా వెంకట్రావుకి చెక్ పెట్టొచ్చన్న ఉద్దేశంతో అశోక్ గజపతిరాజు సలహాతో ఎంపీ కలిశెట్టి ఈ స్కెచ్ వేశారన్న చర్చ నడుస్తోంది.

అయితే, బలమైన సామాజికవర్గానికి చెందిన కడగల ఆనంద్ పేరును కాకుండా, త్రిమూర్తుల రాజును ప్రోత్సహించడంపై ఎంపీ కలిశెట్టిపై గుర్రుగా ఉన్నారట ఆనంద్ వర్గం. ఇలాంటి రాజకీయాలు చేస్తే, వచ్చే స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదని ఆందోళన చెందుతున్నారట. మరి డీసీసీబీ ఛైర్మన్‌ పోస్ట్‌ విషయంలో ఆనంద్‌ వర్గం పైచేయి సాధిస్తుందా.? ఎంపీ అప్పలనాయుడు పంతం నెగ్గించుకుంటారా.? అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. చూడాలి మరి.