వైసీపీ దృష్టిలో పడ్డ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!

  • Published By: sreehari ,Published On : February 22, 2020 / 11:53 PM IST
వైసీపీ దృష్టిలో పడ్డ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!

Updated On : February 22, 2020 / 11:53 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాను 2014 ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో బోల్తా పడింది. 2019 ఎన్నికల్లో అలాంటి ఫలితాలే వస్తాయని టీడీపీ అంచనా వేసింది. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యింది. జిల్లాలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను మాత్రమే గెలుచుకోగలిగింది. అదే ఇప్పుడు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి కలిసి వచ్చిందట. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తన మార్కు పాలన, హడావుడి చేసిన ఆయన… 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కూడా ఎదురొడ్డి గెలిచారు. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 23 సీట్లు మాత్రమే రావడంతో డీలా పడ్డారు. 

కనీసం కన్నెత్తి చూడటం లేదని :
టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అనుకున్న రామానాయుడుకి ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన పార్టీ ఉప పక్ష నేతగా, చంద్రబాబుకు అండగా ఉండే పదవే వచ్చింది. కానీ టీడీపీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గంలో తన మాట వేదంగా భావించే ప్రజలు ఇప్పుడు కనీసం కన్నెత్తి చూడడం లేదని తెగ బాధపడిపోతున్నారట. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా ఎవ్వరు అడక్కపోవడం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా, అధికార పక్షానికి చెందిన కన్వీనర్ వద్దకే ప్రజలు వెళ్తుండటంతో ఇబ్బందిగా అనిపిస్తోందంట. 

వైసీపీలోకి అడుగుపెడితే ఎలా? :
నిత్యం నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నప్పుడు అధికారులతో పాటు, ప్రజలు కూడా చుట్టూ ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్‌లో నడుస్తుండటంతో పార్టీ మారి వైసీపీలోకి అడుగుపెడితే ఎలా ఉంటుందని తన సన్నిహితుల ప్రస్తావిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతానికి టీడీపీకి అండగా అసెంబ్లీ వేదికగా గట్టిగానే మాట్లాడినప్పటికీ ఆయన ఆలోచలన్నీ వైసీపీ వైపు ఉన్నాయంటున్నారు. డాక్టర్ బాబ్జీని వైసీపీలోకి తీసుకువచ్చి నియోజకవర్గ కన్వీనర్ పదవి కట్టబెట్టారు. కానీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో కన్వీనర్ పదవిని తొలగించి కౌరు శ్రీనుకు అప్పగించారు. ఇప్పుడు పాలకొల్లులో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అదే రామానాయుడు పార్టీలోకి వస్తే అందర్నీ సమన్వయం చేయగలరని కొందరు వైసీపీ నేతలే అంటున్నారు. 

వైసీపీ పెద్దలకు ఇదే విషయాన్ని నియోజకవర్గ నాయకులు కొందరు చెప్పారట. అధిష్టానం కూడా రామానాయుడు వస్తానంటే ఆహ్వానించడానికి సిద్ధమేననే సంకేతాలిచ్చారని అంటున్నారు. అన్ని మార్గాలు తనకు అనుకూలంగా ఉండటంతో రామానాయుడు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఉంగుటూరు, ఉండి, భీమవరం నియోజకవర్గాల మీదగా పాలకొల్లు వరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆ మధ్య చేపట్టిన రాజధాని యాత్రకు పాలకొల్లులో రామానాయుడు భారీగా జనసమీకరణ చేశారు.

నియోజకవర్గంలో తనకెంత బలం ఉందో నిరూపించుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. రానున్న రోజుల్లో వైసీపీలోకి వెళ్లడానికి కూడా అదే ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ, రామానాయుడుతో పాటు ఆయన అనుచరులు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.